సొసైటీకి ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ ..సుప్రీంకోర్టు తీర్పు బాధాకరం

సొసైటీకి ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ ..సుప్రీంకోర్టు తీర్పు బాధాకరం
  • దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులే కారణం 
  • కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: జేఎన్ జే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాల్సిందేనని చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు దక్కకపోవడానికి పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తో పాటు, ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే ప్రధాన కారణమని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

17 ఏండ్ల కింద ఒక్కో జర్నలిస్టు రూ.2 లక్షల చొప్పున రూ.12 కోట్లు పోగు చేసి ప్రభుత్వానికి చెల్లించి, జేఎన్​జే హౌజింగ్ సొసైటీ పేరుతో స్థలాలు దక్కించుకున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఏదో ఒక సాకు చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు చేతికి అందించకుండా తీవ్రమైన అన్యాయం చేశాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో జర్నలిస్టుల బతుకులు మరీ దుర్భరంగా మారాయని,  ఇండ్ల స్థలాలడిగితే లాఠీలతో కొట్టించారని వెల్లడించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని, ప్రభుత్వం తనకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించి వారికి ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.