- తెలంగాణలోని పరిస్థితిని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన బండి సంజయ్
- మంత్రి పొంగులేటికికేంద్ర మంత్రి సంజయ్ ఫోన్
- ఖమ్మం జిల్లాలోని పరిస్థితులపై ఆరా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణకు అదనంగా మరో 9 ఎన్డీఆర్ఎఫ్ టీములు రానున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆదివారం రాష్ట్రంలో వర్షాలు, ఖమ్మం జిల్లాలోని పరిస్థితిని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఖమ్మం జిల్లాలో110 గ్రామాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు.
ఖమ్మం పట్టణంలోని ప్రకాశ్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరాతండ గుట్టపైన 68 మంది, బిల్డింగులపైన 42 మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకు ఆయన వివరించారు. దీంతో స్పందించిన అమిత్ షా తెలంగాణకు అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్టు చెప్పారు.
అందులో భాగంగా చెన్నై, వైజాగ్, అసోం నుంచి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపాలని ఉన్నతాధికారులను అమిత్ షా ఆదేశించారని వివరించారు. ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ ను ఆదేశించారు.
పొంగులేటికి బండి ఫోన్...
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఖమ్మం జిల్లాలోని పరిస్థితిపై ఆరా తీశారు. ఖమ్మం సిటీలోని కరుణగిరి ప్రాంతంలో రాజీవ్ గృహకల్ప ఇండ్లు నీట మునిగిపోవడంతో పాటు చాలామంది ప్రజలు ఇంటి పైభాగంలో నిలబడి సాయం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుసుకున్నారు.
ప్రజలను కాపాడేందుకు అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్న విషయాన్ని పొంగులేటికి బండి తెలిపారు. అదేసమయంలో ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బండి సంజయ్... రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వర్షాల పరిస్థితి, ప్రజలు పడుతున్న ఇబ్బందులతో పాటు కొనసాగుతున్న సహాయక చర్యలపైనా సంజయ్ ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బీజేపీ కార్యకర్తలు, నాయకులంతా సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.