హైదరాబాద్: బండి సంజయ్కు పేపర్లు లీక్ చేయడమే తెలుసంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను పేపర్ లీక్ చేసినట్లు కేటీఆర్ ఫ్యామిలీతో సహా ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకుని చీకటి దందా సాగించిన బతుకు నీదని.. నా జోలికి వస్తే నీ చీకటి బతుకును బయటపెడ్తానని కేటీఆర్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ తీసుకోలేదని కేటీఆర్ ప్రమాణం చేయగలరా అని ఈ సందర్భంగా బండి సంజయ్ సవాల్ విసిరారు.
ALSO READ : బీఆర్ఎస్ కాళ్లలో కట్టెలు పెట్టినా ఏది ఆగదు: మంత్రి పొంగులేటి
తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని.. 10 జేసీబీలు పెట్టి లేపిన లేచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తీరు వల్లే కేసీఆర్ బయటకు రాలేకపోతున్నారని నిప్పులు చెరిగారు. మరోవైపు.. నిరుద్యోగుల ఆందోళనపై బీఆర్ఎస్ రాజకీయం చేసిందని ధ్వజమెత్తారు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా మేం ప్రశాంతంగా చేస్తోన్న ర్యాలీలో చొరబడి గొడవలు సృష్టించాలని బీఆర్ఎస్ శ్రేణులు చూశాయని.. నిరుద్యోగుల ముసుగులో గొడవలు చేసేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. మా ర్యాలీలో అక్రమంగా చొరబడి బీజేపీ కార్యకర్తలతో గొడవలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల కుట్రను అభ్యర్థులు గుర్తించి అడ్డుకున్నారని తెలిపారు.