
- రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినా పట్టింపులేదా..? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పంటలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలనే ప్రణాళికను కూడా వ్యవసాయ శాఖ అమలు చేయలేదని ఆరోపించారు. చెరువుల్లో నీరు తగ్గడంతో భూగర్భ జలాలు పడిపోయి బావులు, బోర్ల కింద పంటలన్నీ ఎండి నేల రాలుతున్నాయన్నారు.
ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేమని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి, ఎల్ఎండీ, సింగూరు సహా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 340 టీఎంసీలకుపైగా నీటి నిల్వ ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయని తెలిపారు. ఇందులో 150 టీఎంసీల మేరకు డెడ్ స్టోరేజీ పోగా.. మరో 190 టీఎంసీలకుపైగా నీరు అందుబాటులో ఉందని చెప్పారు.
తాగునీటి అవసరాలకు మినహాయించి మిగిలిన నీటిని విడుదల చేసి చెరువులు నింపితే పంటలు ఎండిపోయే దుస్థితి తలెత్తేది కాదని వివరించారు. మరో నెల రోజుల్లో పంట చేతికి అందే సమయంలో పైర్లు ఎండి పోవడమంటే రైతుల నోటి కాడ ముద్దను నేల పాలు చేయడమేనన్నారు. ఎండిపోతున్న పంటలను రక్షించడానికి రైతులు ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రను వీడటం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.