పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సదరు బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం (డిసెంబర్ 22) పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. తొక్కిసలాటలో మహిళ చనిపోవడం బాధాకరవిషయమని అన్నారు. గాయపడిన శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. యావత్ తెలంగాణ సమాజం అదే కోరుకుంటున్నట్లు తెలిపారు. బాలుడు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారని వెల్లడించారు. రాజకీయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదన్నారు. టీవీలో బాలుడి చికిత్స పొందుతున్న దృశ్యాలు చూసి తన మనసు చలించినట్లు బండి సంజయ్ అన్నారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి
ఇదిలావుంటే, తొక్కిసలాట ఘటనను నిరసిస్తూ ఓయూ జేఏసీ నాయకులు ఆదివారం (డిసెంబర్ 22) హీరో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పయిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంట్లోకి దూసుకెళ్లి కాసేపు రభస సృష్టించారు. పూలకుండీలు పగులగొట్టారు. దాంతో, పోలీసులు అక్కడ భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.