కరీంనగర్ సిటీ, వెలుగు : సమాజంలో నైతిక విలువలు పతనమవుతున్నాయని, కుటుంబ బంధాలు సన్నగిల్లుతున్నాయని, ఈ పరిణామం సమాజానికి చెడు చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రచయితలు తమ రచనల ద్వారా సమాజాన్ని మేల్కొలపాలని పిలుపునిచ్చారు. గురువారం ఎస్‌ఆర్‌ఆర్ ఆర్ట్స్, సైన్స్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు రచించిన ‘రామాయణ కల్పవృక్షం– లోకానుశీలనం’, డాక్టర్ మండలోజు నర్సింహాస్వామి రచించిన ‘డాక్టర్ వెల్చాల కొండల్ రావు జీవితం–- వాఙ్మయ సేవ’, ప్రొఫెసర్ కె.రామకృష్ణ రచించిన పల్లె పరిమళాలకు ఇంగ్లిష్ అనువాదం డాక్టర్ పి.దినకర్ ‘ఫ్రాగ్రన్స్ ఆఫ్ లైఫ్’ ను బండి సంజయ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచయితలు, కవులు పేరిట కొందరు జాతీయవాదంపై దాడి చేస్తున్నారన్నారు. ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ అంటేనే తనకు గుర్తొచ్చేవి కొట్లాటలు, విజయాలేనని, కాలేజీ అభివృద్దికి తప్పకుండా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామకృష్ణ అధ్యక్షత వహించగా, రచయితలు డాక్టర్ వెలిచాల కొండలరావు, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, డాక్టర్ అంపశయ్య నవీన్, కట్టా వేణు, గాజుల రవీందర్, డాక్టర్ కె.సురేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ పి.దినకర్, డాక్టర్ నర్సింహస్వామి, చంద్రశేఖర్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ డి.ప్రకాశ్ పాల్గొన్నారు.