
కరీంనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచణలను ముందుకు తీసుకుపోయేది కేవలం ప్రధాని మోడీ మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఆదివారం (ఏప్రిల్ 13) కరీంనగర్లో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. అంబేద్కర్ స్టేడియం నుంచి కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహ పాదాలకు నమస్కరించి విగ్రహాన్ని శుద్ధి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..120 దేశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు చేసుకుంటున్నారని అన్నారు. విగ్రహాలను శుద్ధి చేయడం అంటే వారి ఆశయాలను ముందు తరాలకు అందించడమేనన్నారు. 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు. అలాగే.. దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్‌ను కోవింద్‌ను భారత రాష్ట్రపతిని చేసింది ప్రధాని మోడీనేనన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అడుగడున బాబా సాహెబ్ అంబేద్కర్‌ను అవమానించిందని విమర్శించారు.
చివరకు అంబేద్కర్ మృత దేహాన్ని కూడా ఢిల్లీలో ఉంచకుండా ముంబాయికి తరలించిన పార్టీ కాంగ్రెస్ అని.. కనీసం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన ఫొటో కూడా పెట్టకుండా అవమానించారని ఫైర్ అయ్యారు. నెహ్రూ, ఇందిరా గాంధీకి భారత రత్న ఇచ్చుకున్నారు తప్ప.. అంబేద్కర్‌కు భారత రత్న ఇవ్వాలని ఏనాడు కాంగ్రెస్ పార్టీ అనుకోలేదని ఆరోపించారు.