తెలంగాణలో కాంగ్రెస్‎కు కౌంట్ డౌన్ స్టార్ట్: కేంద్రమంత్రి బండి సంజయ్

తెలంగాణలో కాంగ్రెస్‎కు కౌంట్ డౌన్ స్టార్ట్: కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని, రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. లాస్ట్ మినిట్ వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ జరిగిన కౌంటింగ్‎లో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి గెలుపు కైవసం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో కరీంనగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాషాయ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ విజయోత్స వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటూ బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ భారీ విజయాలు సాధిస్తోందని బండి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఉద్యోగాల భర్తీ విషయంలోనూ కాంగ్రెస్ మాట తప్పిందని.. రైతులకు, మహిళలకు ఇచ్చిన  హామీలను హస్తం పార్టీ  విస్మరించిందని ఫైర్ అయ్యారు. బీజేపీ విజయానికి కృషి అందరికి ఈ సందర్భంగా బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. 

ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నేతలు ఎన్ని్కల్లో ఓడిన ప్రతిసారి ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. మరీ బ్యాలెట్ పద్దతిలో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది.. ఇప్పుడేమంటారు..? అని ప్రశ్నించారు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపి ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీని ఓడించాలని కుట్ర చేశాయని.. గ్రాడ్యుయేట్లు రెండు పార్టీల కుట్రలను భగ్నం చేశారని అన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని.. పొరుగు రాష్ట్రం ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చింది. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే మాదిరిగా తెలంగాణలో కూడా బీజేపీని గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.