
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను రక్షించేదే బీజేపీ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం (ఫిబ్రవరి 25) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు మీకు చేతకాకపోతే సీబీఐకి అప్పజెప్పండి. ఆ తర్వాత మేం చూసుకుంటాం. దమ్ముంటే కేసును సీబీఐకి అప్పగించడని సవాల్ విసిరారు. మేము కేసీఆర్ బిడ్డను లిక్కర్ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించి చూపించాం. మరీ కేసీఆర్ కుటుంబంపై ఎన్నో కేసులు ఉన్నా.. వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు..? ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు..? అని ప్రశ్నించారు.
మీరు చర్యలు తీసుకోవాల్సింది పోయి నెపం మాపై పెడతారా అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులు విదేశాలకు పారిపోయేలా చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, కాలేశ్వరం ప్రాజెక్టు కేసుల్లో కేసీఆర్‌కి ఇప్పటి వరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు..? ఫార్ములా ఈ కేసులో ఆర్గనైజర్‌ని ఎందుకు అక్యుజుడ్గా చేర్చలేదు..? జన్వాడ ఫాంహౌస్ ఎందుకు కూల్చడం లేదు.. ఇది హైడ్రాలో లేదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ కాంగ్రెస్ నాయకత్వానికి ముడుపులు ముట్టాయి కాబట్టే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ALSO READ | ఏపీకి మిగిలింది 27 టీఎంసీలే..34 టీఎంసీలు ఎలా ఇస్తారు?
ఇక, కుల గణనకు మేం వ్యతిరేకం కానేకాదని.. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ ఎప్పటి నుండో దూదేకుల కులాలకు రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని... మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదన్నారు. కానీ 12.5 శాతం ఉన్న ముస్లిం జనాభాలో 10 శాతం మందిని బీసీల్లో కలుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటాం..? అని అన్నారు. నూటికి 88 మందికిపైగా ముస్లింలను బీసీల్లో కలిపి నిజమైన బీసీల పొట్టకొడతారా..? అని ఫైర్ అయ్యారు. ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి..? అని ప్రశ్నించారు. మీరు చేసిన సర్వేలో 60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ గెలిచింది.. మాది ఇండియా జట్టు. ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్‌ది పాకిస్తాన్ టీం. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో తెలంగాణలో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయండి’’ అని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పట్టభద్రుల, టీచర్ల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.