ఓబీసీలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్​ :మంత్రి భూపేంద్ర యాదవ్

ఓబీసీలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్​ :మంత్రి భూపేంద్ర యాదవ్
  • బీసీసీఈ సదస్సులో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్
  • జమిలి ఎన్నికలు జరుగుతాయి: ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో బీసీలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్  పార్టీ అని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ విమర్శించారు. 65 ఏండ్ల కాంగ్రెస్   పాలనలో ఓబీసీలకు దక్కాల్సిన వాటిని అడ్డుకున్నారని ఆరోపించారు. సోమవారం ఢిల్లీలోని అంబేద్కర్  ఇంటర్నేషనల్  సెంటర్​లో బీజేపీ నేత తూళ్ల వీరేందర్  గౌడ్  నేతృత్వంలోని బ్యాక్‌‌వార్డ్  క్లాసెస్ సెంటర్  ఫర్  ఎంపవర్‌‌మెంట్ (బీసీసీఈ) సదస్సు జరిగింది. ‘ఓబీసీలు, సామాజిక సంస్కరణలపై సింపోజియం’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ నేత వినయ్ సహస్రబుద్ధే, అధ్యాపకులు, మేధావులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఓబీసీలు స్వాభిమానంతో జీవించాలని బీజేపీ కోరుకుంటుందని, అందుకే ప్రధాని మోదీ ఓబీసీ కమిషన్​ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కేంద్ర విద్యాలయాల్లో, వర్సిటీలో సింగిల్  రోస్టర్  విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఏపీ,  తెలంగాణలో ముస్లింల పేరిట ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఈ నిర్ణయంతో ఓబీసీలకు అన్యాయం జరుగుతున్నదని  ఆరోపించారు.

హైదరాబాద్  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓబీసీలకు 50 సీట్లు కేటాయించాల్సి ఉండగా.. మెజారిటీ సీట్లను ముస్లింలకు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్  గాంధీ తిరుగుతున్నారని, కాంగ్రెస్  హయాంలో నే ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ప్రజలు సైతం ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’ కోరుకుంటున్నారని చెప్పారు.