కేసీఆర్ సర్కార్​ను పాతరేద్దాం:కిషన్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన యువతను, నిరుద్యోగులను మోసం చేసిన సీఎం కేసీఆర్ సర్కార్ ను పాతరేద్దామని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులు ఇప్పుడు కండ్లు తెరిచారని.. తమను మోసం చేసిన కేసీఆర్ సర్కార్ ను గద్దె దించేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే నినాదంతో బుధవారం ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ 24 గంటల దీక్షను చేపట్టింది. 

ALSO READ: పార్లమెంట్ సెషన్​ అయ్యేదాకా..స్కీములకు బ్రేక్

ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘తొమ్మిదిన్నరేళ్లు దాటినా ఉద్యోగాలు లేవు. ఉద్యోగ భృతి లేదు. సొంత రాష్ట్రం వచ్చినా మోసమే జరిగిందని 35 లక్షల మంది నిరుద్యోగులు గుర్తించారు. వచ్చే ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని పాతరేసేందుకు ఎదురుచూస్తున్నారు” అంటూ ఆయన హెచ్చరించారు. నిరుద్యోగులు, యువత, విద్యార్థులు ప్రశ్నిస్తే.. వారిపైనే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. 

కేసీఆర్​ కుటుంబం, మంత్రులు జిల్లాలో పర్యటించాలంటే.. ముందుగా నిరుద్యోగులను, యువతను అరెస్టు చేస్తుండటం దారుణమన్నారు. నియంత పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిరుద్యోగులకు అన్యాయం చేశాయని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. యువత అంతా బీజేపీకి అండగా నిలవాలని కోరారు. 

దీక్షకు పార్టీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎంపీ ధర్మపురి అర్వింద్ హాజరై సంఘీభావం తెలిపారు. బీజేపీ నేతలు మురళీధర్ రావు, చింతల రాంచంద్రారెడ్డి, విజయ రామారావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, దుగ్యాల ప్రదీప్, బంగారు శృతి, మనోహర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.       

జమిలి అంటే జంకెందుకు?: బండి సంజయ్ 

జమిలి ఎన్నికలంటే అంత జంకెందుకని సీఎం కేసీఆర్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ చరిష్మా ముందు కేసీఆర్ పాలన కొట్టుకుపోవడం ఖాయమన్నారు. దేశద్రోహుల పార్టీని సంతృప్తి పర్చేందుకే కేసీఆర్ సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా రాగం అందుకున్నారని విమర్శించారు. 

ఏటా సెప్టెంబర్17న విద్రోహ దినంగా భావిస్తూ నల్ల జెండాలు ఎగరేసే ఎంఐఎం నాయకులు ఈసారి జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో ర్యాలీలు తీస్తరట అని ఎద్దేవా చేశారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదన్నారు.  రాష్ట్రంలో బీజేపీ వస్తేనే నిరుద్యోగుల గోస తీరుతుందన్నారు.    

కేసీఆర్ సర్కార్ నిద్ర లేవాలి: తరుణ్ చుగ్

నిరుద్యోగ సమస్యపై బీజేపీ చేస్తున్న పోరాటంతోనైనా కేసీఆర్ సర్కార్ నిద్ర లేవాలని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ చుగ్ హెచ్చరించారు. పదేండ్లుగా కేసీఆర్ సర్కార్ అరాచకాలను ప్రజలు భరించారని, ఇకపై ఊరుకోబోరన్నారు. వచ్చే నవంబర్​తో తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే మకిలి తొలగుతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తమ కుటుంబానికి మాత్రం పదవులు ఇచ్చుకున్నాడని విమర్శించారు. ల్యాడ్ మాఫియాలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని, దీని వెనక కేసీఆర్ హస్తం ఉందన్నారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు అండగా నిలిచే పార్టీ బీజేపీ ఒక్కటేనన్నారు.  

కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకుంది?: డీకే అరుణ  

ఆంధ్ర పాలకులు ఉద్యోగాలను దోచుకుంటున్నారని మాయ మాటలు చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని డీకే అరుణ ఆరోపించారు. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకు నడుస్తుందో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని మాట తప్పిండన్నారు.  

బీజేపీదే అధికారం: ఎంపీ అర్వింద్   

రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీదే అధికారమని ఎంపీ అర్వింద్ అన్నారు. ‘‘కేసీర్ గద్దె ఎక్కడంలో నా పాపం కూడా ఉంది. బీఆర్ఎస్​కు మా నాయన రెండో, మూడో సీట్లు ఇస్తే బాగుండేది. కాని ఎక్కువ సీట్లు ఇచ్చి ఆ పార్టీని బతికించిండు. అప్పుడు నేను కూడ మా నాయనకు సహకరించిన. అందుకే కేసీఆర్ ఇప్పుడు అధికారంలో ఉన్నడంటే నా పాపం కూడా ఉందని చెప్తున్నా” అని ఆయన వెల్లడించారు. ఆ పాపం పోగొట్టుకోవడానికే  కల్వకుంట్ల కవితను ఓడించానని చెప్పారు.