పేదల ఇండ్లను కూల్చనియ్యం...జైలుకు వెళ్లేందుకైనా రెడీ : బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

పేదల ఇండ్లను కూల్చనియ్యం...జైలుకు వెళ్లేందుకైనా రెడీ : బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
  • ధర్నాచౌక్​లో బీజేపీ మహాధర్నా  

హైదరాబాద్, వెలుగు: మూసీ వెంట ఉన్న పేదల ఇండ్లను కూల్చనియ్యబోమని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. బాధితుల కోసం చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు వెళ్లేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని.. కానీ పేదల ఇండ్లు కూల్చుతామంటే మాత్రం అడ్డుకుంటామని హెచ్చరించారు. రిటైనింగ్ వాల్ నిర్మించాకే మూసీ పునరుజ్జీవం చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ లోని ధర్నాచౌక్ లో మూసీ బాధితులకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.

కాంగ్రెస్ సర్కార్ పేదలకు ఇండ్లు ఇవ్వకపోగా, ఉన్న వాటిని కూలుస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలిచ్చి మభ్యపెట్టిందని ఫైర్ అయ్యారు. ‘‘బీఆర్ఎస్  హయాంలో కూడా ఇండ్లకు మార్కింగ్ వేసి ప్రజలను భయపెట్టారు. అప్పుడు మేం అడ్డుకున్నం. మూసీ బాధితులు ఎవరైనా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి మూసీ పక్కన ఉండలేకపోతున్నామని చెప్పారా? తమ ఇండ్లను కూల్చుమన్నారా?” అని ప్రశ్నించారు. హైదరాబాద్​లో అండర్​గ్రౌండ్​డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలన్నారు. ముందుగా పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించి, ఆ తర్వాత మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు.

ఇప్పటికైనా ప్రభత్వం ఇండ్ల కూల్చివేతల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ‘‘మూసీ పరివాహక ప్రాంతంలో నివసించేందుకు నేను సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి సవాల్​ను స్వీకరిస్తున్నాను. మాతో పాటు సీఎం రేవంత్ కూడా అక్కడి బస్తీల్లో తిరగాలి. ఆయనను ప్రజలు ఏమీ అనకుండా మేం రక్షణగా ఉంటాం” అని చెప్పారు. 

అప్పుడు అనుమతిచ్చి,  ఇప్పుడు కూల్చివేతలా?: ఏలేటి  

కాంగ్రెస్ హయాంలోనే మూసీ వెంట ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చారని, ఇప్పుడేమో అక్రమమంటూ కూల్చివేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గతంలో లంకెబిందెలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మరి ఆ లంకె బిందెలు మూసీలో ఉన్నాయా? అందుకే మూసీ ప్రక్షాళన చేస్తున్నారా?మూసీ సుందరీకరణను కాంగ్రెస్ ఏటీఎంలాగా మార్చుకోవాలని అనుకుంటున్నదా?” అని ప్రశ్నించారు. ధర్నాలో ఎంపీలు ఈటల రాజేందర్, గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్, రామారావు పాటిల్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.