కేసీఆర్ ఫ్యామిలీ అవినీతివల్లే రాష్ట్రం అప్పులపాలు: కేంద్రమంత్రి బీఎల్​ వర్మ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కేసీఆర్ కుటుంబం అవినీతి కారణంగానే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖ సహాయ మంత్రి బీఎల్​వర్మ ఆరోపించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని బీజేపీ జిల్లా ఆఫీస్​లో సోమవారం నిర్వహించిన కొత్తగూడెం అసెంబ్లీ మోర్చాల సంయుక్త మీటింగ్​లో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ​ప్రభుత్వం ఆటలాడుకుంటుందని విమర్శించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మీటింగ్​లో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, ఐకార్​మెంబర్ బైరెడ్డి ప్రభాకర్​రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు ఆకుల నాగేశ్వరరావు గౌడ్ ​పాల్గొన్నారు.

కేసీఆర్ ప్రగల్భాలు మానుకోవాలి...

భద్రాచలం: కేంద్రం ఇచ్చే నిధులు, అమలు చేసే పథకాలు తనవిగా చెప్పుకుంటూ ప్రగల్భాలు పలుకుతున్న సీఎం కేసీఆర్ తన తీరు మార్చుకోవాలని కేంద్ర మంత్రి బీఎల్​వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన భద్రాచలంలోని హరిత హోటల్​లో అసెంబ్లీ లీడర్లు, కార్యకర్తలు, బీజేపీ అనుబంధ మోర్చాల లీడర్లతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతీ అభివృద్ధి వెనుక కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది బీజేపీయేనని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, ములుగు జిల్లా ఇన్​చార్జ్ బైరెడ్డి ప్రభాకర్​రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, జిల్లా ప్రధా కార్యదర్శి ఎర్రంరాజు పాల్గొన్నారు.

రామయ్యకు కేంద్ర మంత్రి పూజలు

కేంద్ర మంత్రి బీఎల్ వర్మ శ్రీసీతారామచంద్రస్వామిని సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు పరివట్టం కట్టి ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రికి లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో వేదాశీర్వచనం ఇచ్చారు. ఈవో రమాదేవి దేవస్థానం తరఫున కేంద్ర మంత్రి బీఎల్ వర్మకు ప్రసాదం, శేషవస్త్రాలు, జ్ఞాపికను బహుకరించారు. 

అరవయ్యేళ్లలో కానిది 9ఏళ్లలోనే చూపించాం

ఇల్లెందు, వెలుగు: ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలనలో జరగని దేశాభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలోనే ప్రధాని మోదీ చేసి చూపించారని కేంద్ర మంత్రి బీఎల్​వర్మ తెలిపారు. మహాజన్ సంపర్క్ యోజనలో భాగంగా సోమవారం ఇల్లెందులోని రాందేవ్ బాబా మందిరంలో సంయుక్త మోర్చాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందకుండా చేస్తోందని ఆరోపించారు. 

కిసాన్, మహిళా, ఓబీసీ, మైనారిటీ మోర్చాలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువయ్యలా చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్​రెడ్డి, జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు కోనేరు చిన్ని, నాళ్ల సోమసుందరం, ఇల్లెందు నియోజనవర్గ కన్వీనర్​బాలగాని గోపికృష్ణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి రామ్​చందర్, మైనార్టీ లీడర్ విమల్​జైన్ ​పాల్గొన్నారు.