బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ఖమ్మం/ నేలకొండపల్లి/ముదిగొండ/
 కారేపల్లి, వెలుగు:  వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయమే లక్ష్యంగా పని చేయాలని కేంద్ర సహకార, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ కోరారు. ఇటీవల బీజేపీ అధిష్టానం ఆయనను ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్​ జిల్లాల ఇన్​చార్జిగా నియమించగా, తొలిసారిగా బీఎల్ వర్మ ఖమ్మం జిల్లాకు వచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఖమ్మంలో బీజేపీ ఆఫీస్​ బేరర్లు, ఖమ్మం లోకసభ కోర్​ కమిటీ నేతలు, మండల పార్టీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికీ కేంద్ర పథకాలపై అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. 

జిల్లా నేతల ఘన స్వాగతం 
రెండ్రోజుల పర్యటన కోసం సోమవారం ఉదయం వచ్చిన కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మకు ఖమ్మం జిల్లా పరిహద్దు నేలకొండపల్లి మండలం పైనంపల్లి దగ్గర బీజేపీ జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు. నేలకొండపల్లి మండలకేంద్రంలో ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా లబ్ధిదారులకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, గ్యాస్​ స్టవ్ లను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్ ప్రవాస్ యోజన పేరుతో ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో 2024 వరకు నిరంతరం తిరుగుతూ ప్రధాని మోడీ అందిస్తున్న వివిధ పథకాలు పేద ప్రజలకు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తానని చెప్పారు. వాటన్నింటిని పేదలకు అందేలా చర్యలు తీసుకోవటంతో పాటు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్  తీసుకుంటానని తెలిపారు. మోడీ ప్రవేశ పెట్టిన ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు తన చేతుల మీదుగా అందజేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 9 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కలెక్షన్లు అందజేశామని తెలిపారు. తర్వాత ముదిగొండలో ఆయన పర్యటించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాదాపురం సర్పంచ్​ ఎర్రబోలు వేణుగోపాల రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మినేని సుధాకర్ మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతించారు. ఖమ్మం, కోదాడ హైవే పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. సువర్ణాపురంలో పార్టీ నేత పసుపులేటి రాజశేఖర్ నివాసానికి వెళ్లి అల్పాహారం స్వీకరించారు. వెంకటాపురం గ్రామానికి చెందిన రైతులు హైవే రోడ్ నుంచి తమ పొలాలకు వెళ్లేందుకు అప్రోచ్​ రోడ్​ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, నేతలు మన్నె కృష్ణారావు, ఉపేందర్  ఉన్నారు.

గిరిజనులతో కలిసి రాత్రి భోజనం
సోమవారం రాత్రి కారేపల్లి మండలం గుంపెళ్లగూడెంలో కేంద్రమంత్రి బీఎల్ వర్మ పర్యటించారు. అక్కడి గిరిజనులతో సమావేశమై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. రాత్రి అక్కడే గిరిజనులతో కలిసి భోజనం చేశారు.