అవినీతి నిర్మూలనకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి బీఎల్ వర్మ

9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేసిందన్నారు కేంద్ర మంత్రి బీ ఎల్ వర్మ. సంపర్క్ అభియాన్ లో భాగంగా జూన్ 4వ తేదీ ఆదివారం ఆయన వరంగల్ పట్టణంలో పర్యటిస్తున్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్ వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని..ఉగ్రవాద చర్యలను కట్టడి చేయడంలో మోడీ ప్రభుత్వం సఫలమైందని తెలిపారాయన. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని..కోవిడ్ సమయంలో అందరం ఒక్కటై పోరాడామని గుర్తు చేశారు. ప్రజల ఆకలి తీర్చడానికి 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించామన్నారు. అవినీతి నిర్మూలనకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు.

ఆర్థికాభివృద్ధిలో భారత్  టాప్ ఫైవ్ లోకి చేరుకుంది. ప్రపంచం వైపు చూసే మనం.. ఇప్పుడు ప్రపంచాన్ని మన వైపు చూసేలా చేశామని బీఎల్ వర్మ అన్నారు. 9 ఏళ్లలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని తెలిపారు. మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ద్వజమెత్తారు. మోడీని మళ్లీ ఆశీర్వదించడానికి దేశం సిద్దంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 2019 కంటే అత్యధిక మెజారిటీ సాధిస్తామని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ పేర్కొన్నారు.