రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్ఈపీపై విమర్శలు .. స్టాలిన్​ సర్కారుపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపణ

 రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్ఈపీపై విమర్శలు .. స్టాలిన్​ సర్కారుపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపణ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) అమలు చేయడానికి కేంద్రం కట్టుబడి ఉన్నదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తమిళనాడు ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్ఈపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నదని ఆరోపించారు. 

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.." అత్యంత పురాతన భాషలలో  తమిళం ఒకటి. ఎన్ఈపీ విధానంతో తమిళ ప్రజలపై హిందీ లేదా మరే ఇతర భాష రుద్దడం లేదు. కానీ జాతీయ విద్యా విధానం తమిళనాడులోని విద్యార్థులకు బహుభాషా విద్యను అందిస్తే తప్పేముంది ? తమిళనాడులో కొంతమంది దీనిని రాజకీయం చేస్తున్నారు. కానీ కేంద్రం ఎన్ఈపీ అమలుకు కట్టుబడే ఉంది.ఎన్ఈపీ విధానంలో ప్రతిపాదించబడిన మూడు భాషల సూత్రాన్ని అమలు చేయడంపై కేంద్రంతో తమిళనాడు ప్రభుత్వం విభేదిస్తున్నది. స్టాలిన్ సర్కార్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్ఈపీ విధానాన్ని అమలు చేయడం లేదు. విద్యార్థుల మధ్య పోటీని సృష్టించి, వారికి సమాన అవకాశాలను అందించడానికి ఒక ఉమ్మడి వేదిక కావాలి. ఎన్ఈపీనే ఆ కొత్త ఉమ్మడి వేదిక. నేను అన్ని భాషలను గౌరవిస్తాను. ఎన్ఈపీ కూడా  మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తుంది" అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.  

ఎన్ఈపీని తమిళనాడు ఆమోదించే వరకు నిధులు ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన మొత్తం  రూ.2,152 కోట్లను ఇతర రాష్ట్రాలకు ఇచ్చారని..కేంద్రం ఓపెన్ బ్లాక్‌‌‌‌మెయిల్ కు పాల్పడుతోందని పేర్కొన్నారు.