
- రాష్ట్రంలో ఏడాదిగా సీఎం రేవంత్ సవాళ్ల పాలన
- బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్‌రెడ్డి కామెంట్స్
నిజామాబాద్/ భైంసా/, ఖానాపూర్, వెలుగు: పదేండ్లలో కేసీఆర్ కుటుంబంలోనే బంగారు తెలంగాణ అయిందని కేంద్ర మంత్రి, బీజేపీస్టేట్ ప్రెసిడెంట్ జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఏడాది నుంచి సీఎం రేవంత్‌రెడ్డి సవాళ్ల పాలన నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్, నిర్మల్ జిల్లా భైంసా, ఖానాపూర్ లో నిర్వహించిన మీటింగ్‌ల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి 400 రోజులు దాటినా అమలు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత రాష్ట్రంలో ప్రజాఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. బీసీ కులగణన, రిజర్వేషన్లకు బీజేపీ పూర్తి సపోర్టుగా నిలబడుతుందని, అయితే ముస్లింలను బీసీలుగా చేర్చే కుట్రను మాత్రం అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బీసీల ఎదుగుదల పట్ల బీజేపీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పని లేదన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో విభేదాలు ఇంటర్నల్ గా చర్చించుకొని సెట్చేసుకుంటామన్నారు.
ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్
ప్రజలు మార్పు కోరుకోవడంతోనే అదృష్టవశాత్తు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం దక్కిందన్నారు. రైతుల కష్టాలను చూసిన ప్రధాని మోదీ కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఆర్థికసాయం అందజేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గ్రాడ్యుయేట్లు, టీచర్లు కర్రు కాల్చి వాత పెట్టాలని కిషన్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్ ను కాంగ్రెస్ వసూలు చేసి ఢిల్లీకి వేల కోట్ల రూపాయలను పంపుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ సర్కార్ లో ఏదైనా పని జరగాలంటే కమీషన్ లేనిదే జరగడం లేదని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ గొడెం నగేశ్, ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు రామారావు పటేల్, మహేశ్వర్‌రెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ పాల్గొన్నారు.