![ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక ఒక్క బీజేపీనే : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/union-minister-g-kishan-reddy-participated-and-spoke-at-mlc-election-meetings-in-kandi-and-patancheru_rDAEUeJTvb.jpg)
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ జంకుతున్నయ్
- మూడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీ
- కంది, పటాన్ చెరులో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశాలు
కంది/పటాన్ చెరు, వెలుగు : రాష్ట్రంలో ఒక్క బీజేపీ మాత్రమే ప్రశ్నించే గొంతుకగా అన్నివర్గాలకు అండగా ఉంటోందని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని టీచర్లు, యువత భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కంది, పటాన్ చెరులో ఎమ్మెల్సీ అభ్యర్థులు మల్క కొమరయ్య, అంజిరెడ్డిలకు మద్దతుగా నిర్వహించిన సమావేశాల్లో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
రానున్న రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో టీచర్ల పక్షాన పూర్తిస్థాయిలో అండగా నిలబడుతామన్నారు. బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ సమస్యలపై బీజేపీ చిత్త శుద్ధితో పోరాడుతోందన్నారు. నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తప్ప మిగతా ఏ రాజకీయ పార్టీ పోటీ చేసే ధైర్యం చేయలేదన్నారు. కాంగ్రెస్ అర సీటుకు పోటీ చేస్తుండగా ప్రచారం చేసుకునే పరిస్థితిలో కూడా లేదన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
11 ఏండ్లలో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సుమారు రూ. 10 లక్షల కోట్ల నిధులు ఖర్చుచేసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసైనా బీజేపీ అభ్యర్థులకు ఓటు వే యాలని చెప్పారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ అభ్యర్థులు, మల్క కొమరయ్య, అంజిరెడ్డి, సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు సి. గోదావరి, నేతలు పాల్గొన్నారు.