సైకిల్ పై వచ్చి బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి

సైకిల్ పై వచ్చి బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి

ఢిల్లీ : కొందరు రాజకీయ నాయకులు సినిమా స్టైల్లో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్ లాగే సైకిల్ పై ఆఫీస్ కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు బీజేపీ సీనియర్ నేత డాక్టర్ హర్షవర్థన్. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆయనకు ప్రధాని మోడీ రెండో మంత్రివర్గంలో ఆరోగ్య శాఖను కేటాయించారు. దేశ ప్రజలను ఆరోగ్య కరంగా ఉంచడమే ఆయన కర్తవ్యం. అందుకే బాధ్యతలను చేపట్టే రోజు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రచారం చేయాలని భావించిన ఆయన.. ఇంటి దగ్గరి నుంచి సచివాలయానికి సైకిల్‌పై వెళ్లి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా హర్షవర్థన్ మాట్లాడుతూ.. ఆరోగ్య రంగంలో ప్రధాని మోడీ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లామని.. ఆరోగ్యకర భారతవని కోసం అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకునేలా అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రజలందరికీ చేరేలా చూస్తామని హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

సైకిల్ పై రావడంతో ఆయన అభిమానులు, కర్యకర్తలు సెల్పీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. మొత్తానికి సైకిల్ పై రావాలనే ఐడియాతో స్థానికంగా పాపులర్ అయ్యారు హర్షవర్థన్.