తాళిబొట్టు తీస్తేనే పరీక్ష రాయనిస్తం.. కర్నాటకలో నియామక పరీక్షలకు రైల్వే శాఖ వివాదాస్పద రూల్

తాళిబొట్టు తీస్తేనే పరీక్ష రాయనిస్తం.. కర్నాటకలో నియామక పరీక్షలకు రైల్వే శాఖ వివాదాస్పద రూల్
  • విమర్శలు వెల్లువెత్తడంతో తొలగింపు

బెంగళూరు: పోటీ పరీక్షలకు వచ్చే వివాహిత మహిళలను మంగళసూత్రంతో పరీక్ష హాల్​లోకి అనుమతించబోమని, పరీక్ష రాయాలంటే తాళిబొట్టు తప్పనిసరిగా తీసి రావాల్సిందేనని రైల్వే శాఖ పెట్టిన కండిషన్‌‌పై కర్నాటకలో దుమారం రేగింది. మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని విశ్వహిందూ పరిషత్‌‌ (వీహెచ్‌‌పీ) నేతలు నిరసన వ్యక్తం చేశారు. హిందువులు ఎక్కువగా ఉన్న మన దేశంలో ఇలాంటి విధానాలను అంగీకరించేది లేదని బెంగళూరులో ఆందోళనకు దిగారు. హాల్‌‌ టికెట్లపై పేర్కొన్న కండిషన్లను వాపస్‌‌ తీస్కోవాలని డిమాండ్ చేశారు. 

తాళిబొట్టు తీయకుండానే రైల్వే పరీక్ష రాసేలా అనుమతించాలంటూ జిల్లా కలెక్టర్‌‌‌‌తో పాటు పలువురు ఎంపీలకు వీహెచ్‌‌పీ వినతి పత్రాలు సమర్పించింది. కాగా, రైల్వే డిపార్ట్‌‌మెంట్‌‌లో నర్సింగ్‌‌ సూపరింటెండెంట్‌‌ పోస్టులకు ఈనెల 28 నుంచి కర్నాటకలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు వచ్చే అభ్యర్థులు మంగళసూత్రం, చెవిపోగులు, ముక్కు పిన్నులు, ఉంగరాలు, కంకణాలు, జంధ్యం వంటి చిహ్నాలు సహా ఎలాంటి ఆభరణాలు ధరించకూడదని హాల్‌‌టికెట్లపై పేర్కొన్నారు. దీనిపై వివాదం చెలరేగింది. మన నమ్మకాలకు సంబంధించిన చిహ్నాలను తొలగించాలని ప్రజలను కోరడం ఆమోదించదగినది కాదని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌ కూడా మండిపడ్డారు.

వెనక్కి తగ్గిన రైల్వే శాఖ

వీహెచ్‌‌పీ నిరసనల తర్వాత రైల్వే తన వివాదాస్పద నిర్ణయాన్ని వాపస్‌‌ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎగ్జామ్‌‌కు వచ్చే అభ్యర్థులు, వివాహిత మహిళలు మంగళసూత్రం, జంధ్యం వంటి చిహ్నాలను తొలగించాల్సిన అవసరం లేదని తెలిపింది. మత స్వేచ్ఛను గౌరవిస్తున్నామని  స్పష్టం చేసింది.