న్యూఢిల్లీ: అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారుల బహిష్కరణ కొత్తేమీ కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఇది కొన్నేండ్లుగా సాగుతున్నదని చెప్పారు. అమెరికా తాజాగా 104 మంది ఇండియన్ మైగ్రేంట్స్ను స్వదేశానికి పంపించడంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి జైశంకర్గురువారం ప్రకటన చేశారు. వలసదారులకు సంకెళ్లు వేసి పంపిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన ఈ సందర్భంగా స్పందించారు.
డీపోర్టేషన్ సమయంలో మైగ్రేంట్స్పట్ల అలా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తున్నదని తెలిపారు. 2009 నుంచి అమెరికా బహిష్కరించిన ఇండియన్ల సంఖ్య 734గా ఉంటే.. 2019లో 2,042కు చేరుకున్నదని చెప్పారు. 2024లో 1,368 మంది, 2025లో ఇప్పటివరకు104 మందిని వెనక్కి పంపిందని తెలిపారు.
వారికి సంకెళ్లు వేయలే..
అమెరికా నుంచి మైగ్రేంట్స్ను స్వదేశాలకు పంపించే ఆపరేషన్‌ను ఇమ్మిగ్రేషన్అండ్కస్టమ్స్ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) చూసుకుంటుందని జై శంకర్ వెల్లడించారు. వలసదారులను ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలించే విధానాన్ని అమెరికా 2012నుంచి అమలు చేస్తోందని, ఆ నిబంధనల ప్రకారం మైగ్రేంట్స్ను నిర్బంధిస్తారని చెప్పారు. ఇందులో మహిళలు, చిన్నారులకు మినహాయింపు ఇచ్చినట్టు తమకు సమాచారం ఉందన్నారు.
అలాగే, జర్నీలో వారికి ఆహారంతోపాటు వైద్యసేవలు అందించినట్టు చెప్పారు. టాయిలెట్‌కు వెళ్లే సమయాల్లో తాత్కాలికంగా వారికి సంకెళ్లు తొలగిస్తారని తెలిపారు. ఇక యూఎస్‌లో ఆస్తులు కలిగి ఉన్న బహిష్కృత వలసదారులు సమస్యను పరిష్కరించేందుకు ఇక్కడి అధికారులు కృషిచేస్తున్నారని చెప్పారు. అక్రమ వసలదారులకు సంబంధించిన ఎలాంటి డేటా తమ వద్ద లేదని తెలిపారు. ఈ కేసుకు స్టూడెంట్వీసా ఇష్యూ వర్తించదని క్లారిటీ ఇచ్చారు.