గొడవలొద్దు.. బార్డర్‌‌‌‌లో టెన్షన్స్ తగ్గించుకుందాం

గొడవలొద్దు.. బార్డర్‌‌‌‌లో టెన్షన్స్ తగ్గించుకుందాం

మాస్కోలో కేంద్ర మంత్రి జైశంకర్, చైనీస్ మినిస్టర్ వాంగ్ యీ భేటీ
చైనా బలగాల మోహరింపుపై జైశంకర్ ఆందోళన
నమ్మకముండాలె.. అనుమానమొద్దన్న వాంగ్ యీ

న్యూఢిల్లీ: బార్డర్ లో ప్రస్తుత పరిస్థితి వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని ఇండియా, చైనా అభిప్రాయపడ్డాయి. ఇరుదేశాల మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంబడి టెన్షన్లను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అంగీకారానికి వచ్చాయి. బార్డర్ వెంబడి టెన్షన్స్ ను పెంచే ఎలాంటి చర్యలకు పాల్పడరాదని నిర్ణయించాయి. ఇందుకోసం ‘5 పాయింట్ల రోడ్ మ్యాప్’ను ఫాలో కావాలని రెండు దేశాలూ ఒఫ్పుకొన్నాయి. తూర్పు లడఖ్ లో ఎల్ఏసీ వెంబడి చైనీస్ సోల్జర్ల ఆక్రమణలతో నెలకొన్న వివాదంపై మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్, చైనీస్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ చర్చలు జరిపారు. మాస్కోలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) మీటింగ్ సందర్భంగా గురువారం సాయంత్రం వీరు రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు. మాస్కోలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్, చైనీస్ డిఫెన్స్ మినిస్టర్ జనరల్ వీ ఫెంఘ్ కూడా భేటీ అయ్యారు.

సోల్జర్లు దూరం పాటించాలి..

జైశంకర్, వాంగ్ యీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి విదేశాంగ శాఖ శుక్రవారం జాయింట్ స్టేట్ మెంట్ ను విడుదల చేసింది. రెండు దేశాల సోల్జర్లు తగినంత దూరం పాటించాలని, ప్రస్తుతం ఉన్న అన్ని అగ్రిమెంట్లు, ప్రొటోకాల్ కు కట్టుబడి ఉండాలని అంగీకరించినట్లు తెలిపింది. ‘‘బార్డర్ లో శాంతి, టెన్షన్ రహిత పరిస్థితులను కొనసాగించేందుకు నమ్మకమైన చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరుదేశాల మంత్రులు నిర్ణయించారు. స్పెషల్ రిప్రజెంటేటివ్ మెకానిజం ద్వారా చర్చలు, కమ్యూనికేషన్ ను కొనసాగించాలని అంగీకరించారు. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా-చైనా బార్డర్ అఫైర్స్ (డబ్ల్యూఎంసీసీ) మీటింగ్స్ కూడా కొనసాగించాలని నిర్ణయించారు. బార్డర్ వివాదంపై ‘5 పాయింట్ల ఒప్పందం’ ప్రకారం ఇరుదేశాలూ నడుచుకోవాల్సి ఉంది’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.

చైనా తీరుపై జైశంకర్ ఆందోళన   

ఎల్ఏసీ వెంబడి చైనా భారీ ఎత్తున బలగాలను మోహరించడం, ఎక్విప్ మెంట్ ను తరలించడంపై జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బార్డర్ కు భారీగా సైనికులను తరలించడంపై చైనా నమ్మదగిన సమాధానం ఇవ్వలేదని ఈ మీటింగ్ లో ఆయన స్పష్టం చేశారు. ఇది 1993, 1996 నాటి బార్డర్ అగ్రిమెంట్లకు విరుద్ధమని తేల్చిచెప్పారు. చైనీస్ ఫ్రంట్ లైన్ సోల్జర్ల రెచ్చగొట్టే చర్యలు ఈ అగ్రిమెంట్లను ఉల్లంఘించడమేనని తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలు పెరగడానికి బార్డర్ వద్ద శాంతి కొనసాగడం ముఖ్యమన్నారు. రెండు దేశాల ప్రయోజనాల కోసం ప్రస్తుత పరిస్థితిని వెంటనే చక్కదిద్దుకోవాలన్నారు. మళ్లీ గొడవలు రాకుండా, బలగాలను వెనక్కి తీసుకోవాలని, పర్మినెంట్ పోస్టులు, బలగాల మోహరింపుపై రెండు వైపులా మిలిటరీ కమాండర్స్ ద్వారా ప్రాసెస్ ను కొనసాగించాలని సూచించారు.

విభేదాలు మామూలే: వాంగ్ యీ   

ఇరుగు పొరుగు దేశాలైన ఇండియా, చైనా మధ్య విభేదాలు రావడం మామూలేనని చైనా డిఫెన్స్ మినిస్టర్ వాంగ్ యీ కేంద్ర మంత్రి జైశంకర్ కు చెప్పారని చైనీస్ విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. విభేదాలపై రెండు దేశాల నాయకుల సలహాల మేరకు నడుచుకోవాలని ఆయన అన్నారని తెలిపింది. వేగంగా డెవలప్ అవుతున్న పెద్ద దేశాలైన ఇండియా, చైనాకు ప్రస్తుతం కోఆపరేషన్ అవసరం కానీ.. గొడవ కాదని, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి కానీ.. అనుమానం ఉండరాదన్నారని పేర్కొంది. రెండు దేశాలూ సరైన దిశలో ముందుకెళితే ఎలాంటి సవాలునైనా అధిగమించొచ్చని చెప్పారని
తెలిపింది.

తాజా అగ్రిమెంట్‌‌‌‌లోని 5 పాయింట్లు ఇవే..

బార్డర్ ఏరియాల్లో ప్రస్తుత పరిస్థితి వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు.

ఇరువైపులా బార్డర్ ట్రూప్స్ చర్చలను కొనసాగించాలి.

బార్డర్ నుంచి త్వరగా బలగాలను వెనక్కి తీసుకోవాలి.

ఇరుదేశాల సైనికులు తగిన దూరం పాటించాలి.

బార్డర్ వెంబడి టెన్షన్స్ తగ్గేందుకు చర్యలు తీసుకోవాలి.

For More News..

రాష్ట్రాలు సెంటర్‌‌‌‌ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ పాటించాల్సిందే

మీరు మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

ఈసారైనా రాయల్స్‌ రాత మారేనా?