తెలంగాణ స్కిల్ వర్సిటీకి నిధులు ఇవ్వలేం : కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ స్కిల్ వర్సిటీకి నిధులు ఇవ్వలేం : కేంద్ర ప్రభుత్వం
  • లోక్ సభలో ఎంపీ చామల ప్రశ్నకు  కేంద్ర మంత్రి జయంత్ ఆన్సర్​
  • పలు స్కీంల ద్వారా క్రెడిబిలిటీ సంస్థలకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు వెల్లడి 

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిధులు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ వర్సిటీకి నిధులు ఇచ్చేలా కేంద్రంలో ఎలాంటి పథకం లేదని వెల్లడించింది. అయితే, ఇతర స్కీమ్స్​ ద్వారా క్రెడిబిలిటీ కలిగిన సంస్థలకు సహకారం అందిస్తామని తెలిపింది. సోమవారం లోక్ సభ క్వశ్చన్​ అవర్ లో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి కేంద్ర ఆర్థిక సాయం అంశాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేవనెత్తారు. ఈ అంశంపై సప్లిమెంటరీ ప్రశ్నను అడిగారు. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడానికి, ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్​లో సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని  ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్నట్టు చెప్పారు.  

పీపీపీ మోడల్ లో చేపట్టిన ఈ వర్సిటీ కోసం 17 ప్రియారిటీ సెక్టార్లు ఐడెంటిఫై చేసినట్టు తెలిపారు. 2025–26 మొదటి ఏడాదిలో 2 వేల మందికి శిక్షణ అందిస్తామని, ఏటా 20 వేల మందికి ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు వివరించారు. ఈ వర్సిటీ కోసం సీఎం రూ.100 కోట్లు రిలీజ్ చేశారని చెప్పారు. కార్పస్ ఫండ్‌‌ కింద రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లు సృష్టించనున్నట్టు సభ దృష్టికి తెచ్చారు. అయితే, ఈ యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీకి తగిన నిధులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన ఉందా? అని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు.

 ఇందుకు స్కిల్ డెవలప్‌‌మెంట్ అండ్ ఎంటర్‌‌ప్రెన్యూర్‌‌షిప్ మంత్రి జయంత్ చౌదరి మౌఖికంగా సమాధానమిచ్చారు. రాష్ట్ర చట్టాల ప్రకారం.. చాలా రాష్ట్రాలు స్కిల్ వర్సిటీలను నెలకొల్పుతున్నాయన్నారు.  నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ –2020 ప్రకారం.. ప్రస్తుతం స్కూల్స్ లో స్కిల్ ఎకో సిస్టం నెలకొల్పడం తమ లక్ష్యమన్నారు. అనంతరం హయ్యర్​ ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేస్తామని వివరించారు. అండర్ గ్రాడ్యుయేట్ లెవల్ లో ఇప్పటికే యూజీసీ గైడ్ లైన్స్ ను రిలీజ్ చేశామని సభకు వివరించారు.