
చేవెళ్ల, వెలుగు: సేంద్రియ సాగుతోనే ఎక్కువ ఉపయోగం ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని బద్ధం సురేందర్‌రెడ్డి గార్డెన్ లో ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి, సేంద్రియ రైతు సమ్మేళనం శనివారం రెండోరోజూ కొనసాగింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, సుజనా చౌదరితో కలిసి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యవసాయంలో వచ్చే సమూల మార్పులతో పాటు సేంద్రియ ఎరువులు వాడేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆధునిక పద్ధతిలో ఆర్గానిక్ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయానికి డిగ్రీలు, పట్టాలు అవసరం లేదని చదువు లేని వారు కూడా సేంద్రియ వ్యవసాయం చేసి అభివృద్ధి చెందవచ్చని సూచించారు. ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. ఇదిలాఉంటే తాండూర్ నుంచి రైతులు వస్తున్న టవేరా వెహికల్ అదుపు తప్పి బోల్తాపడింది. డ్రైవర్‌తో పాటు 8 మందికి గాయాలయ్యాయి.