మునుగోడు ఉప ఎన్నికలు ధర్మానికి, న్యాయానికి..అన్యాయానికి, అక్రమాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కోట్లు కుమ్మరించినా..వారి బలం పెరగడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ కుటుంబం సూట్ కేసుల నిండా డబ్బులు, లారీల నిండా మద్యం, చికెన్, బిర్యానీ పొట్లాలతో వస్తున్నారని ఆరోపించారు. అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తూ..మునుగోడులో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...రత్తిపల్లి, గంగోని గూడెం గ్రామాల్లో పర్యటించారు.
ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు..
మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ 8 ఏళ్లలో రూ. 5లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడే పుట్టిన పసిబిడ్డతో పాటు..ప్రజల నెత్తిమీద కేసీఆర్ లక్ష రూపాయల అప్పు పెట్టాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లోని అంగన్వాడీ వర్కర్లు, పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.
వైన్ షాపులకు అడ్డాగా మార్చేశారు..
రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో అడుగడుగునా వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఓపెన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్ప పథకాల పేరు మీద డబ్బులు చేతిలో పెట్టి... మరో చేతితో మద్యం విక్రయిస్తూ...ప్రజల నుంచి డబ్బులు లాక్కుంటోందన్నారు. మద్యం సేవించడం వల్లే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని.... కుటుంబాలు ఆగమవుతున్నయని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరవీరు ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం రావాలి...
తెలంగాణకు దళితులు, బీసీలు, రైతులు, రైతు కూలీలు సీఎం కావొద్దని కేసీఆర్ అనుకుంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు. 1200 మంది ఆత్మబలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ పార్టీ కోసమా అని ప్రశ్నించారు. విమానాలు కొనుక్కోవడం కోసమా? పదెకరాల్లో ఇల్లు కట్టుకోవడం కోసమా ? అని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములు కబ్జాకు గురవుతున్నాయన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఖాళీ స్థలాలను వదలడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియాకు అడ్డగా రాష్ట్రాన్ని మార్చేశారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే...ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల ఆకాంక్షలు నెరవేరాలంటే..బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు.
పేదలకు ఇళ్లు కట్టించరు..కానీ ఫాం హౌజ్ లు కట్టుకుంటారు..
రాష్ట్రంలో కేసీఆర్ పేరు మీద ఒక ఫామ్ హౌస్, ఆయన కొడుకుకో ఫామ్ హౌస్, కూతురుకో ఫామ్ హౌస్, ఆయన అల్లుడికో ఫామ్ హౌస్ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కుటుంబం సొంతంగా విమానం కొనుగోలు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. గత 8 ఏళ్ల నుంచి గ్రామాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానని..ఇళ్లు కట్టుకున్నాక..కోడి కొయ్యాలని అద్భుతమైన మాటలు కేసీఆర్ చెప్పారన్నారు. కేసీఆర్ మాటలు వింటుంటే..ఆహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాస్ రావు సీన్ గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు.
కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయింది...
పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్..ఎవరిని కలవడని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పొదుపు సంఘాల మహిళలు, దళిత సంఘాల నాయకులు, కార్మిక, విద్యార్థి నాయకులను కలిసేందుకు కేసీఆర్ కు టైం లేదన్నాడు. కానీ కుటుంబ సభ్యులను..అతని అనుచరులను కలిసేందుకు మాత్రం కేసీఆర్ కు సమయం ఉంటుందని విమర్శించారు. కేసీఆర్ పాలన చూస్తుంటే..నిజాం పాలన గుర్తుకు వస్తుందన్నారు. ఎంతో మంది ఆత్మబలిదానాల వల్ల ఏర్పడిన తెలంగాణ ..కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.