బీసీల రిజర్వేషన్లపై రేవంత్‌‌‌‌కు చిత్తశుద్ధి లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బీసీల రిజర్వేషన్లపై రేవంత్‌‌‌‌కు చిత్తశుద్ధి లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • వాళ్లను ఓటు బ్యాంక్‌‌‌‌గా నే చూస్తున్నరు: కిషన్‌‌‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, ఎంతసేపూ వారిని వాడుకొని వదిలేయాలని చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయం తాము ముందు నుంచి చెప్తున్నామని, ఇప్పుడు ఢిల్లీ ధర్నాతో మరోసారి నిరూపితం అయిందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో రేవంత్​కు చిత్తశుద్ధి లేదన్నారు. ‘‘బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి ధర్నాకు దిగడం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నమే.

బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని మీరు హామీ ఇచ్చి ఇప్పుడు కేంద్రంపై నెపం మోపుడేంది? బీసీ రిజర్వేషన్ల పెంపు మీ పరిధిలో లేకపోతే, హామీ ఎలా ఇచ్చారు? బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేకనే రేవంత్ రెడ్డి ఈ డ్రామాలాడుతున్నారు. రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి. తొలి ప్రధాని నెహ్రూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారు. ఇందిరా గాంధీ కూడా బీసీ రిజర్వేషన్ల అమలును తొక్కిపెట్టారు. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని నాటి ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రయత్నిస్తే, నాడు రాజీవ్ గాంధీ పార్లమెంటు వేదికగానే వ్యతిరేకించారు. వారి వారసత్వంలోనే రాహుల్ గాంధీ బీసీ వ్యతిరేకతను నరనరాన నింపుకున్నరు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డితో డ్రామాలు ఆడిస్తున్నారు” అని కిషన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. 

గత్యంతరం లేక బిల్లు పాస్ చేశారు

బీసీలకు 42% రిజర్వేషన్​పై ఆ వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో గత్యంతరం లేక అసెంబ్లీలో బిల్లును పాస్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీసీ సంక్షేమం కోసం ఏడాదికి రూ.20 వేల కోట్లు చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల ఖర్చు చేస్తామని చెప్పారు గానీ, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలోనూ ఆ హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. ‘‘జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మంత్రి పదవులు రెండంటే రెండే. దీనిని బట్టే తెలుస్తుంది బీసీల మీద కాంగ్రెస్‌‌‌‌కు ఎంత ప్రేమ ఉందో తెలిసింది. రేవంత్ రెడ్డి బీసీలకు చేసిన మోసాల చిట్టా చాలా పెద్దది. బీసీ సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది”అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.