సీఎం రేవంత్​వి తప్పుడు ఆరోపణలు: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

సీఎం రేవంత్​వి తప్పుడు ఆరోపణలు: కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
  • బ్లాక్​మెయిల్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత పోతదా? 
  • పెద్ద గొంతేసుకుని మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు
  • కేసీఆర్ దిగిపోతే నాకెందుకు బాధుంటది?
  • రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే అజ్ఞానులం కాదు
  • దక్షిణాదిలో సీట్లు తగ్గిస్తామని ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: తనను ఎవరు తిట్టినా బెదిరించనని, అలాంటిది తాను కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అనడమేమిటని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డి మండిపడ్డారు. ‘‘సీఎం రేవంత్​రెడ్డి దిగజారి, దివాలాకోరు ఆరోపణలు చేస్తున్నడు. అందరూ ఆయనలాగే ఉంటారనుకుంటే ఎట్ల? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక బీజేపీపై, వ్యక్తిగతంగా నాపై రేవంత్​ తప్పుడు ఆరోపణలు చేస్తున్నడు” అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ దిగిపోతే తనకెందుకు బాధ ఉంటుందని ప్రశ్నించారు. నిజానికి కాంగ్రెస్​కే కేసీఆర్ మిత్రుడని ఆయన అన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్​రెడ్డి మాట్లాడారు. గెలుపు కోసమో, రెచ్చగొట్టడం కోసమో బీజేపీ రాజకీయాలు చేయదని తెలిపారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తమ నినాదమన్నారు. 

రేవంత్​లో అసహనం

సీఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో, అసహనంతో మాట్లాడుతున్నారని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ వచ్చిన నాటి నుంచి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నదని, కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను (పంటల బీమా, ఆయుష్మాన్ భారత్) రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందక అమలు చేయలేకపోయామని ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలైందని.. అయినా ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్​రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి.. . బీజేపీని బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రాన రేవంత్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పోదు. పెద్ద గొంతేసుకుని మాట్లాడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు” అని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.10 లక్షల కోట్లకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు తెలియజేశానని కిషన్​రెడ్డి అన్నారు. కేసీఆర్  సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై 40 లేఖలు రాశానని, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి కూడా పలుమార్లు లేఖ రాశానని తెలిపారు. ‘‘రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి తెలంగాణ ఏమైనా రేవంత్ రెడ్డి సొంత జాగీరా? సీఎం పదవిలో ఇయ్యాల ఆయన ఉంటాడు.. రేపు ఇంకొకరు ఉంటారు.. రేవంత్ పై కోపంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేంత అజ్ఞానులం మేం కాదు” అని కిషన్​రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఆయా ప్రాజెక్టులకు ఎంత కేటాయించారో ముందు రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. 

అడిగినా అడగకున్నా ట్రిపుల్​ ఆర్​ పూర్తయితది

తనకు సీఎం రేవంత్ రాసిన లేఖను చూసి సీనియర్ ఆఫీసర్లు కూడా నవ్వుకుంటున్నారని కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు తయారుచేసింది తామేనని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. ‘‘రేవంత్ అడిగినా.. అడగకపోయినా ట్రిపుల్​ ఆర్​ పూర్తవుతుంది. రేవంత్ సీఎం అవ్వగానే మెట్రో సెకండ్ ఫేజ్ పనులు సమగ్రంగా లేవని ప్రాజెక్టును ఆపేసిండు.. కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చిండు. దానికి కేబినెట్ ఆమోదం కోసమే 10 నెలల సమయం పట్టింది.ఫస్ట్ ఫేజ్ లో ఫలక్ నూమా వరకు వెళ్లాల్సి ఉండగా దాన్ని అఫ్జల్ గంజ్ లోనే ఆపేశారు. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి కేంద్రం రూ.1200 కోట్లు కేటాయించినా ఇంకా పూర్తికాలేదు” అని ఆయన తెలిపారు. ‘‘బీసీ రిజర్వేషన్లు అన్యమతస్తులకు ఇస్తుంటే అడ్డుకోవద్దా?’’ అని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే ఏపీలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని చెప్పారు. దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గిస్తామని ఎక్కడా చెప్పలేదని, దీనిపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. త్రిభాష విధానం తెచ్చిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్ ఆమోదం అవసరం లేదని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.