- ఇండ్ల కోసం నిర్వహించే సర్వేలో పాల్గొనండి
- సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లులేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇండ్ల కోసం నిర్వహించనున్న సర్వేలో పాల్గొని, సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను కేంద్రానికి అందించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించినప్పుడు సొంతింటి విషయమై చాలా మంది సహకారం కోరారని చెప్పారు.
ఈ విషయాన్ని ఇటీవల జరిగిన కేంద్రమంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకుపోతే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే ఇండ్లు కేటాయించేందుకు సిద్ధమని చెప్పినట్టు లేఖలో వెల్లడించారు. 2016లో పీఎం ఆవాస్ యోజన స్కీమ్‌ను కేంద్రం తీసుకొచ్చిందని, 2024 నాటికి 2.95 కోట్ల పక్కా ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. రెండో విడతలో మార్చి 2029 నాటికి మరో రెండు కోట్ల ఇండ్లను నిర్మించి ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఇండ్లు నిర్మించి ఇచ్చినట్టు గుర్తుచేశారు. ఇంకా మిగిలిపోయిన జాబితాను అస్సాం, బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలు కేంద్రానికి అందించాయని పేర్కొన్నారు. తెలంగాణలోనూ సొంతిండ్లు లేనోళ్లు లక్షల్లో ఉన్నా.. 2018లో కేంద్రం నిర్వహించిన సర్వేలో భాగస్వామ్యం కాలేదని చెప్పారు. దీంతో ఇండ్లు లేని వారి జాబితాను కేంద్రానికి పంపలేదని వెల్లడించారు. కేంద్రప్రభుత్వం నిర్వహించే సర్వేలో పాల్గొని, తెలంగాణలోని పేదలకు ఇండ్లు అందించేందుకు సహకారం అందించాలని కోరారు.
రాష్ట్ర నిర్లక్ష్యమే విద్యావ్యవస్థకు శాపం
రాష్ట్ర విద్యావ్యవస్థకు ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారిందని కిషన్ రెడ్డి అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వర్సిటీలు, కాలేజీల పనితీరు అధ్వానంగా ఉండడం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదని మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని స్కూళ్ల పనితీరు కూడా నానాటికీ తీసికట్టుగా మారుతున్నదని ఇటీవలి ఉమ్మడి జిల్లాల విద్య సమాచార వ్యవస్థ సర్వే తేల్చిందని గుర్తు చేశారు. ఈ పాపంలో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలన పాత్ర ఎంత ఉందో.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమూ అంతే ఉందన్నారు.
యూనివర్సిటీ ర్యాంకుల్లో మెరుగైన స్థానంలో ఉన్న ఓయూ దారుణంగా దిగజారిందన్నారు. 2022లో 46వ స్థానంలో ఉన్న ఓయూ.. నిరుడు 64వ ర్యాంకు, తాజాగా 70వ ర్యాంకుకు పడిపోయిందన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే ఐఐటీ హైదరాబాద్, హెచ్‌సీయూ, నైపర్, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ మెరుగైన పనితీరు కనబరుస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా సంస్థలు దిగజారుతున్నాయంటే లోపం ఎక్కడుందో స్పష్టమవుతుందని అన్నారు.