సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డును విస్తరించండి : కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డును విస్తరించండి : కిషన్ రెడ్డి
  • సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్స్‌‌‌‌కు వెళ్లే రోడ్లను విస్తరించాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం బహిరంగం లేఖ రాశారు." తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్ మోడ్‌‌‌‌లో పూర్తవుతోంది. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ తో పాటుగా లైన్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు, 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు శర వేగంగా జరుగుతున్నాయి. 

సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త రైల్వే టర్మినల్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగిస్తున్నాం.  హైదరాబాద్‌‌‌‌కు సంబంధించిన ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలకు కూడా చర్లపల్లి రైల్వేటర్మినల్ కేంద్రం కానుంది. ఇలాంటి కీలకమైన రైల్వే టర్మినల్ కు ఎఫ్‌‌‌‌సీఐ గోడౌన్ వైపు నుంచి ప్రయాణికుల రాకపోకల కోసం 100 అడుగుల రోడ్డు నిర్మాణం అవసరం.  భరత్‌‌‌‌నగర్ వైపు కూడా 80 అడుగుల మార్గం, మహాలక్ష్మినగర్  వైపు మరో 80 అడుగుల రోడ్డు అవసరం ఉంది. అలాగే ఇండస్ట్రియల్ షెడ్స్ ముందున్న రోడ్డును కూడా 80 ఫీట్లకు విస్తరించాల్సిన అవసరం ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయించేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నాం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌‌‌‌ను రూ.715 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్నాం. ట్రాఫిక్ సమస్యలు తగ్గించాలంటే రోడ్ల విస్తరణ అవసరం"అని కిషన్ రెడ్డి తన లేఖ ద్వారా సీఎంకు వివరించారు.