ఏడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ : కిషన్ రెడ్డి

ఏడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ : కిషన్ రెడ్డి
  • రాజకీయ జోక్యం లేకుండా ప్రతిభ,అర్హత ఆధారంగానే కొలువులు
  • నిరుద్యోగులను ఉద్యోగాలిచ్చే స్థాయికి తీర్చిదిద్దుతున్నామని వెల్లడి 
  • రోజ్ గార్ మేళాలో 546 మంది అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత

హైదరాబాద్, వెలుగు: గత ఏడాదిన్నర కాలంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగ యువతకు మోదీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా.. అభ్యర్థుల అర్హతలు, ప్రతిభ ఆధారంగా యుద్ధ ప్రాతిపదికన నియామక ప్రక్రియ నిర్వహించినట్టు చెప్పారు. సోమవారం చాంద్రాయణగుట్టలోని సీఆర్పీఎఫ్ లో జరిగిన రోజ్ గార్ మేళా కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి స్కీముల ద్వారా..  ప్రైవేటు రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. 

ఉద్యోగార్థులు.. ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్’ను నిర్మించడంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొన్నేండ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా భారత్.. దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా మారిందని తెలిపారు. 2014లో రక్షణ రంగంలో రూ.900 కోట్ల ఎగుమతులు జరిగాయన్నారు. ఇప్పుడు మనం దాదాపు రూ.15 వేల కోట్ల ఎగుమతులు చేస్తున్నామని చెప్పారు. దాదాపు 75 దేశాలకు ఎగుమతి అవుతున్న మన రక్షణ ఉత్పత్తులతో ఉపాధి కూడా గణనీయంగా పెరిగాయని ఆయన తెలిపారు. 

99 శాతం మొబైల్ ఫోన్లు మన దేశంలో తయారీ

దేశంలో 2014లో మొబైల్ తయారీ కంపెనీలు రెండే ఉండగా.. ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో 99 శాతం మన దేశంలో తయారవుతున్నాయని కిషన్​రెడ్డి తెలిపారు. చైనా తరువాత ప్రపంచంలో అతి తక్కువ ధరలకు 4జీ ఇంటర్‌‌‌‌నెట్ సర్వీసును అందిస్తున్న దేశం మనదేనని చెప్పారు. ప్రస్తుతం మనం సుమారు 150 దేశాలకు సెల్ ఫోన్లు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని వివరించారు. అనంతరం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 546 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను కిషన్​రెడ్డి అందజేశారు. వారంతా సీఆర్‌‌‌‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌‌‌‌బీ, రైల్వే, తపాలా, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ -హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఎస్‌‌‌‌బీఐ, కెనరా బ్యాంకులలో వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.