- ఎవరికైనా అమ్మే తొలి గురువు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్న ప్రధాని
- ఏడాది పాటు సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడి
- హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వేదికగా భరతమాత హారతి కార్యక్రమం
హైదరాబాద్, వెలుగు: భరతమాత భారతదేశానికి ప్రతీక అని, ఎవరికైనా అమ్మే తొలి గురువు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు వేదికగా ఆదివారం భరతమాత మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఏటా నెక్లెస్ రోడ్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇది 8వ సంవత్సరం అని తెలిపారు.
ఆదివారం ప్రారంభమైన సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని ఏడాదిపాటు నిర్వహిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా జాతీయ భావనను పెంపొందించేలా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి, మాడుగుల నాగఫణి శర్మ, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
ఆధ్యాత్మికత, సంప్రదాయాల కలయిక: గవర్నర్
భరతమాత హారతి వంటి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికత, సంప్రదాయాల కలయిక ఉట్టిపడుతున్నదని చెప్పారు. ‘‘భరతమాత హారతి అనేది కార్యక్రమం కాదు.. ఓ ఉద్యమం లాంటిది. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ అనే భావనను ప్రతి ఒక్కరిలో నింపుతుంది. ఈ వేడుకలు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఒక్కచోట చేర్చి.. మన దేశ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు దోహదపడుతుంది” అని పేర్కొన్నారు. ఐకమత్యం, దేశ భక్తిని మనలో ఇనుమడింపజేయడంలో ‘భారత్ మాత ఫౌండేషన్’ కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన తెలిపారు.
రాజ్యాంగ స్ఫూర్తితోనే మహిళా రిజర్వేషన్లు
జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత బీజేపీకే దక్కిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీసులో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తితో మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని విమర్శించారు. రాహుల్కు అంబేద్కర్ స్ఫూర్తి అర్థం కాదని కామెంట్ చేశారు. ఆదివారం గణతంత్ర వేడుకల్లో భాగంగా రాజ్యాంగ ప్రవేశికపై బీజేపీ నేతలతో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.