![కేసీఆర్, రేవంత్ ఇద్దరు కలిసి రండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్](https://static.v6velugu.com/uploads/2025/02/union-minister-kishan-reddy-challenges-kcr-and-revanth-reddy_QspK2cMYBq.jpg)
సంగారెడ్డి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. పదేళ్లలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని కేసీఆర్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. ఇద్దరు కలిసి రండి.. పదేళ్లలో మోడీ సర్కార్ ఏం చేసిందో చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. అలాగే.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై హరీష్ రావు, కేటీఆర్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. శుక్రవారం (ఫిబ్రవరి 14) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మొత్తం కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగేలా బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలన చేసిందని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్తో విసిగిపోయిన ప్రజలు.. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. ఇచ్చిన 420 హామీలు అమలుచేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్పై పదేళ్లలో వ్యతిరేకత వస్తే.. కాంగ్రెస్ పార్టీపై పది నెలల్లోనే వ్యతిరేకత పెరిగిందని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్టాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ అప్పుల కుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి మార్పు రాలేదని.. మారింది సీఎం, పార్టీ జెండా మాత్రమే.. పరిపాలన మాత్రం అలానే ఉందని అన్నారు.
త్వరలో జరగబోయే మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే.. శాసన మండలిలో వాళ్లు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఉంటారని చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ శాసన మండలిని నిర్వీర్యం చేసిందని.. రాష్ట్రంలో అసలు శాసనమండలి ఉందా లేదా అన్న అనుమానం కలిగేటట్టు బీఆర్ఎస్ వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్లో నిరుద్యోగుల వద్దకు వచ్చి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.. మరీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రభుత్వా్న్ని నిలదీశారు.
ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరు
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం పీఆర్సీ ప్రకటించినా.. రాష్టంలో మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించే కొత్త ఇంటర్నేషనల్ స్కూల్ మాట దేవుడేరుగు.. ఇప్పుడున్న స్కూళ్లకు రంగులు వేయలేని పరిస్థితి తెలంగాణలో ఉందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్, బీఆర్ఎస్ దెబ్బతీశాయన్నారు. 2014లో మోడీ ప్రధాని కాకముందు 3 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పుడు రూ.26 వేల కోట్లతో తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
అలాగే.. త్వరలోనే కొమురవెళ్లి రైల్వే స్టేషన్ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు వస్తామని కిషన్ రెడ్డి గుడ్ న్యూ్స్ చెప్పారు. రాబోయే అన్ని ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా మాత్రమే వస్తుందని.. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హస్తం పార్టీ ఓటమి ఖాయమని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో అధికారంలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు.