మొయినాబాద్ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు : కిషన్ రెడ్డి

మొయినాబాద్ ఫాం హౌస్ ఘటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మధ్యవర్తుల ద్వారా నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసిందని వస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతోనైనా లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఫాం హౌస్ కు వెళ్లకముందే టీఆర్ఎస్ సోషల్ మీడియాలో  బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఫాంహౌస్ లో ఎంత డబ్బు దొరికిందో పోలీసులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఫాం హౌస్ కు డబ్బులు తెచ్చుకుంది, పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని అన్నారు.

మొయినాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసిన ముగ్గురితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందా..? అని ప్రశ్నించారు. నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తమకు వచ్చే లాభం ఏంటన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు ప్రజాదరణ ఉన్న నాయకులా...? అని ప్రశ్నించారు. గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఇలాంటి జిమ్మిక్కులు చేసిందని, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా చేస్తోందని ఆరోపించారు. ‘టీఆర్ఎస్ వ్యవహారం చూస్తుంటే దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్లు చెల్లించి బీజేపీలోకి చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. నందు అనే వ్యక్తితో టీఆర్ఎస్ కు చెందిన చాలామంది నాయకులతో సంబంధాలు ఉన్నాయి’ అని అన్నారు. 

ఫాంహౌస్ ఘటన విఠలాచార్య సినిమాలను తలపించేలా కేసీఆర్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఉందని కిషన్ రెడ్డి సెటైర్ వేశారు. నవంబర్ 6వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా ప్లాప్ అవుతుందన్నారు. తమ పార్టీకి విమానాలు కొనే స్థోమత లేదన్నారు. గతంలో కూడా ఒక మంత్రి హత్యకు కుట్ర పన్నారంటూ తమ పార్టీ నేతలపై ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసులు దాడులు చేసి, డబ్బులు దొరికాయాంటూ అడ్డంగా బుక్కయ్యారని చెప్పారు. ఒక ఉప ఎన్నిక కోసం చిల్లర రాజకీయం అవసరమా..? అని అన్నారు. టీఆర్ఎస్ డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల నుంచి ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా పరిపాలన చేస్తోందన్నారు. ఎనిమిదేళ్లుగా నిత్యం భూ కబ్జాలు,సెటిల్ మెంట్లు, కమీషన్లలో మగ్గే టీఆర్ఎస్ నాయకులకు తమను విమర్శించే అర్హత లేదన్నారు. తమకు ఇప్పుడు ఉన్న త్రిబుల్ ఆర్ ఎమ్మెల్యేలతో (ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్) పాటు మునుగోడు ఎమ్మెల్యేగా గెలవబోయే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు చేస్తారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఎన్ని డ్రామాలు చేసినా, ఊరుకో మంత్రిని, ఎమ్మెల్యేను పెట్టినా తమకే ఓట్లు వేస్తారనే నమ్మకం టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. తమ పార్టీలో చేరాలనుకునే ఎమ్మెల్యేలతో ముందుగా రాజీనామాలు చేయించి.. బీజేపీలో చేర్చుకుంటామన్నారు. 

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను టీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించి.. ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఇచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి చేర్చుకునే సమయంలో వారితో రాజీనామాలు చేయించకుండానే మంత్రి పదవులు ఇచ్చిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన పోయే వరకూ తాము విశ్రమించేది లేదన్నారు. ఇతర పార్టీలో ఉన్న నాయకులకు పదవుల ఆశచూపి టీఆర్ఎస్ లో చేర్చుకున్నది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెడుతామని బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి, ఇతర పార్టీల్లో ఉన్న నేతలను టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని అన్నారు. 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి  ఏ ప్రతిపాదికన చేర్చుకున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలో ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తమ పరిపాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై భవిష్యత్తులో దర్యాప్తు సంస్థలతో విచారణ జరుగుతుందనే భయాలు టీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయని చెప్పారు.