భూపాలపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా రూ. లక్షకోట్ల ప్రజాధనం గోదావరి పాలైందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి తెలంగాణ మేధావుల మాట వినకుండా ప్రాజెక్ట్ నిర్మించి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి ఇవాళ ఆయన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు హెలికాప్టర్లో చేరుకున్న వారికి స్థానిక బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మేడిగడ్డ బ్యారేజీ గురించి అక్కడి సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్‌కు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్వహించాలని, వెంటనే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ పిల్లర్లకు పగుళ్లు వచ్చిన విషయం తెలియగానే కేంద్రమంత్రిగా కేంద్ర జల శక్తి కమిషన్‌కు లేఖ రాశానని, లేఖపై స్పందించిన నేషనల్డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలనకు వచ్చిందన్నారు. అన్నారం బ్యారేజ్ పరిస్థితి కూడా మేడిగడ్డ లాగానే ఉందని, ఒక్క టీఎంసీ నీళ్లయినా నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడిందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేసిన అంచనాలను పూర్తిగా మార్చేసి ప్రణాళిక లేకుండా ప్రాజెక్టును నిర్మించారని మండిపడ్డారు. కేసీఆర్ఒంటెత్తు పోకడలతో ప్రాజెక్టును నిర్మించారని, కనీసం ఇంజినీర్లు చెప్పినా వినకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. కేసీఆర్ వల్ల ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనం వృథా చేసి నాసిరకం ప్రాజెక్ట్ కట్టారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ చాలా గొప్పదని డిస్కవర్ చానల్లో కూడా ప్రసారం చేయించుకున్నారని గుర్తు చేశారు. బ్యారేజీ డ్యామేజ్అయినా ఇంతవరకు సీఎం కేసీఆర్‌నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.