
సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించకపోవడం కేసీఆర్ రాజరికానికి నిదర్శనమని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా వ్యవహారించలేదన్న కిషన్ రెడ్డి.. కేసీఆర్ విచిత్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం కారణంగా రాష్ట్రం పరువుపోతుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం ఆలోచనలతోనే ముందుకు వెళ్తున్నాడని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటం కోసం ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ ను ఎత్తేసిన సీఎం ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల కార్యకర్తలను అరెస్టులు చేయడం రివాజుగా మార్చుకున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో సభలు, సమావేశాలు, పాదయాత్రలు చేసేందుకు హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంప్రదాయాలను పాటించడం లేదని విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అన్ని రాష్ట్రాల్లో సంప్రదాయంగా వస్తోందన్న కిషన్ రెడ్డి.. కేసీఆర్ సర్కారు మాత్రం గవర్నర్ ప్రసంగం కుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.