ఇది కరెక్ట్ కాదు.. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఇది కరెక్ట్ కాదు.. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ‘‘నటుడు అల్లు అర్జున్ నివాసంపై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. ఈ ఘటన పౌరుల భద్రత, శాంతి భద్రతలను రక్షించడంలో కాంగ్రెస్ అసమర్థ పరిపాలనను ప్రతిబింబిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళాకారులను, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం ప్రమాదకరమైన ఆనవాయితీగా మారింది’’ అని విమర్శలు గుప్పించారు.

ఈ ఘటన కాంగ్రెస్‎కు మద్దతుగా జరిగిందా లేక స్పాన్సర్డ్‎గా జరిగిందా అని నిలదీశారు కిషన్ రెడ్డి. కాగా, 2024, డిసెంబర్ 22న హైదరాబాద్ జూబ్లీహిల్స్‎లోని అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీ నేతలు దాడికి దిగిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు, టమాటాలు రువ్వి.. ఇంట్లోని పూల కుండీలను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.