జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ మధ్య సమన్వయ లోపం వల్లనే చిన్నారి మౌనిక చనిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదని ధర్నాలు చేస్తున్నారని.. జీహెచ్ఎంసీ వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నా... కనీస సదుపాయాలు కల్పించలేకపోతుందన్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే మౌనిక చనిపోయిందన్నారు. సికింద్రాబాద్ కళాసిగూడాలో మృతి చెందిన మౌనిక కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తల్లిదండ్రలను ఓదార్చారు.
హైదరాబాద్లో మ్యాన్ హోల్ లో పడి చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుని తవ్వి, వాటర్ వర్క్స్ పైప్ వేస్తామని కొత్త రోడ్డు వేయకుండా ఆపేశారని విమర్శించారు. పేద ప్రజలు ఉండే ప్రాంతాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయని అన్నారు. వాటర్ వర్క్స్ కోసం రోడ్డును తవ్వి రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 80 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని తెలిపారు. నాయకులు భూముల కబ్జాలో బిజీగా ఉన్నారని విమర్శించారు. వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కడెక్కడ ఉందో..అక్కడ ముందస్తు చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీని ఆదేశించారు.