మీడియాను అణచివేసే అలవాటు కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది

  • భారత్​లో మీడియా స్వేచ్ఛపై విదేశాల్లో రాహుల్ దుష్ప్రచారం: కిషన్​రెడ్డి
  • రాజ్యాంగం చేతిలో పట్టుకున్నంత మాత్రాన జనం విశ్వసించరని కామెంట్

న్యూఢిల్లీ, వెలుగు: చెప్పడం ఇష్టం లేని ప్రశ్నలను జీర్ణించుకోలేక.. మీడియాను అణచివేసే అలవాటు కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.  నెహ్రూ కుటుంబంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. 

భారత్ లో మీడియా స్వేచ్ఛ పై విదేశాల్లో కాంగ్రెస్​అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ  దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్​ మాటలకు, చేతలకు సంబంధం ఉండదని మరోసారి నిరూపితమైందని  శనివారం ఒక ప్రకటనలో కిషన్​రెడ్డి విమర్శించారు. 

విదేశీ గడ్డపై దేశ ప్రజాస్వామ్య విలువలను దిగజార్చేలా, రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. సెప్టెంబర్ 7న అమెరికాలోని డల్లాస్​లో కాంగ్రెస్ పార్టీ గూండాలు జరిపిన దౌర్జన్యకాండపై, అప్రజాస్వామిక చర్యపై  ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గమన్నారు.

 రోహిత్ శర్మ అనే ఇండియా టుడే సీనియర్ జర్నలిస్టు డల్లాస్​లో కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహారాల ఇన్​చార్జి శామ్ పిట్రోడాను ఇంటర్వ్యూ చేశారని, ఈ సందర్భంగా  బంగ్లాదేశ్ లో హిందువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనా రాహుల్ స్పందిస్తారా?  అని ప్రశ్నించారని తెలిపారు.  

దీంతో అక్కడున్న కాంగ్రెస్ నేతలు రోహిత్ శర్మ ఫోన్ లాక్కొని.. మొత్తం ఇంటర్వ్యూ వీడియో డిలీట్ చేసేంతవరకు గదిలో నిర్బంధించారని ఆరోపించారు. ఈ ఘటన  కాంగ్రెస్ పార్టీ  హిందువుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతున్నదని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. 

కేవలం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగినంత మాత్రాన జనం విశ్వసించరని అన్నారు. నాడు రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఎమర్జెన్సీ సమయంలో ఏకంగా పత్రికాస్వేచ్ఛను గొంతునులిమారాని ఫైర్ అయ్యారు.