న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని, ఆ రెండు కుటుంబ పార్టీలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీకి కాంగ్రెస్ ఎంత దూరమో, బీఆర్ఎస్ కూడా అంతే దూరమని స్పష్టం చేశారు. కేసీఆర్ కాంగ్రెస్‌తోనే నాయకుడిగా ఎదిగారన్నారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ సీక్రెట్అగ్రిమెంట్ చేసుకున్నాయన్నారు.
ఖమ్మం సభలో బీజేపీకి బీఆర్ఎస్ ‘బీ’ టీమ్ అనడం రాహుల్ గాంధీ మిడిమిడి జ్ఞానానికి నిదర్శనమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి కేసీఆర్ ఊరేగింపు చేసి, సన్మానం చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపెట్టుకొని.. కేంద్రం, రాష్ట్రంలో మంత్రి పదవులు పంచుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. కానీ బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ కలిసి పనిచేయలేదని, భవిష్యత్‌లోనూ కలిసి పనిచేసే ప్రసక్తే లేదన్నారు. ఇటీవల పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్.. ఇప్పుడు కేసీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చారన్నారు. అఖిలేశ్ యాదవ్, కేసీఆర్ ను కలవడంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ల బంధమేంటో తేటతెల్లం అవుతున్నదన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నం
తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని కిషన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఈ నెల 8న వరంగల్‌లో వేల కోట్ల అభివృద్ధి కార్య్రమాలకు ప్రధాని భూమి పూజ చేస్తారని చెప్పారు. నెలకు 200 వ్యాగన్ల తయారీ సామర్థ్యం గల వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే రూ.5,500 కోట్ల జాతీయ రహదారుల పనులకు కూడా మోదీ భూమి పూజ చేస్తారని వివరించారు. తర్వాత ఆర్ట్స్ కాలేజ్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడతారని కిషన్ రెడ్డి చెప్పారు.
రాహుల్‌వి పగటి కలలు
కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే, రాహుల్ గాంధీపై నమ్మకం లేక వారిలో 12 మంది బీఆర్ఎస్లో చేరారన్నారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని రాహుల్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగలేనంటూ పారిపోయిన ఆయనకు బీజేపీని విమర్శించే హక్కు లేదన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందన్నారు. అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని విమర్శించారు. యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)పై కాంగ్రెస్, రాహుల్ వైఖరి ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు. ఉచితాలు, సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ యోచిస్తోందని విమర్శించారు.