డబుల్ ఇంజన్ సర్కార్​తోనే అభివృద్ధి : బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

డబుల్ ఇంజన్ సర్కార్​తోనే అభివృద్ధి : బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
  •  రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తం: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దోపిడీకి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు కాంగ్రెస్ లీడర్ రాహుల్​కు లేదన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసిన తర్వాతే ఆయన తెలంగాణలో అడుగుపెట్టాలన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్​లో హైదరాబాద్ సిటీలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నది. అందుకే.. బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నరు. లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నాం. ఇప్పటి దాకా ఏ ఒక్క కేంద్ర మంత్రి, ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణలు రాలేవు. రాజ్యాంగంతో పాటు అంబేద్కర్​ను అవమానించిన పార్టీ కాంగ్రెస్. మాజీ ప్రధాని పీవీని కూడా అవమానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తది’’అని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్ రెడ్డి, స్టేట్ సెక్రటరీ ప్రకాశ్ రెడ్డి, హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు.