కాంగ్రెస్, బీఆర్ఎస్.. MIM ఏజెంట్స్.. బీజేపీ ఓడించేందుకు ఒక్కటైనయ్: కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్.. MIM ఏజెంట్స్.. బీజేపీ ఓడించేందుకు ఒక్కటైనయ్: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్​ లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం  ఒక్కటయ్యాయని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్​ పార్టీకి మిగిలిన రెండు పార్టీలు ఏజెంట్లుగా పనిచేస్తున్నాయని అన్నారు. బీజేపీ బరాబర్ రజాకార్ల వ్యతిరేక పార్టీ అని చెప్పారు. ప్రధాని మోదీ వల్లే తెలంగాణకు కూడా పెట్టుబడులు వస్తున్నాయని, కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం వారి వల్లనే అంటూ సంకలు గుద్దుకుంటున్నాయని విమర్శించారు.

 శుక్రవారం హైదరాబాద్​లోని హరిత ప్లాజాలో కిషన్​రెడ్డి అధ్యక్షతన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ సన్నాహక సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంఐఎం తెలంగాణ ప్రజల నెత్తురు తాగిన పార్టీ అని, అలాంటి పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ జీ హుజూర్ అంటున్నాయని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదో  దేశానికి కాంగ్రెస్ , బీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కే మజ్లిస్ పార్టీ పరిమితం కాలేదని, యావత్ తెలంగాణ అంతటా చాప కింద నీరులా  విస్తరిస్తున్నదని అన్నారు.   

ప్రజల్లో చైతన్యం రావాలి

తెలంగాణ ప్రజలు చైతన్యం కాకపోతే మళ్లీ రజాకార్ల కాలం వస్తుందని, నాటి దౌర్జన్యాలు మొదలవుతాయని కిషన్​రెడ్డి అన్నారు. ఇప్పటికే పాతబస్తీలో ఎన్నో హిందూ కాలనీలను కనుమరుగు చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీ, కేసీఆర్ ఇద్దరూ అసదుద్దీన్ ఒవైసీ కనుసన్నల్లో పని చేస్తున్నారని చెప్పారు. మజ్లిస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకే ఉందని, ఈ ఎన్నికలు ధర్మ యుద్ధమని వెల్లడించారు. కార్పొరేటర్లంతా ముందుకు వచ్చి మజ్లిస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని  పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే తెలంగాణ, హైదరాబాద్ బాగుపడతాయని చెప్పారు. 

నిత్యం బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని కేటీఆర్ అంటున్నారనీ, కానీ బీజేపీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అని వెల్లడించారు. అయితే, కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ లోనే పుట్టిన వ్యక్తి అని అన్నారు. ఒక్క ఓటు కూడా ఇన్ వ్యాలిడ్ కాకుండా వేయాలని కార్పొరేటర్లకు సూచించారు. ప్రజలు కూడా మీ కార్పొరేటర్లపై ఒత్తిడి  తెచ్చి బీజేపీకి ఓటు వేసేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో  ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కాగా,  ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.