- ఢిల్లీలో ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదు :కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని, అనుసరించిన విధానాలను దేశ ప్రజలకు వివరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ గౌరవ ప్రచార కార్యక్రమాలు ఏడాది పాటు కొనసాగిస్తామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ బర్కత్‌పురాలోని బీజేపీ సిటీ ఆఫీసులో నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ వర్క్ షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని విమర్శించారు.
రాజ్యాంగాన్ని అనేక రకాలుగా అవమానించి, తమ రాజకీయ అవసరాలకు అనుకూలంగా మార్పులు చేసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహంతో అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించి ప్రజల తీర్పును కాలరాశారని, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూడా అలాగే గద్దెదించే ప్రయత్నం చేసిందన్నారు. అంతకు ముందు ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులోనూ మీడియాతో మాట్లాడుతూ... ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని, ఆ పార్టీకి అక్కడ దిక్కేలేదన్నారు. కనీసం కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు కూడా ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు.