మెదక్ – అక్కన్నపేట రైల్వే లైన్ జాతికి అంకితం

ఎట్టకేలకు మెదక్, అక్కన్నపేట మధ్య రైల్వే సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. మెదక్ నుంచి కాచిగూడ వరకు 17.2 కిలోమీటర్ల మేర నడిచే కొత్త ప్యాసింజర్ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మెదక్, అక్కన్నపేట మధ్య నిర్మించిన ఈ కొత్త రైల్వే లైన్ ను జాతికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రైల్వే లైన్ ప్రారంభం ద్వారా పరిసర ప్రాంతాల ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరిందన్నారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా మెదక్ రైల్వే స్టేషన్ లో  జై భారత్ మాత, జై తెలంగాణ అంటూ బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. కాగా, కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులతో ఈ రైల్వే లైన్ ను నిర్మించడం గమనార్హం. దీని మొత్తం నిర్మాణ వ్యయం దాదాపు రూ.210.75 కోట్లు. 

17 స్టేషన్ల మీదుగా..

మెదక్ నుంచి కాచిగూడ స్టేషన్ వరకు మొత్తం 17 స్టేషన్ల మీదుగా కొత్త ప్యాసింజర్ రైలును నడపనున్నారు.  అక్కన్నపేట, మెదక్ రైల్వే లైన్ మార్గంలో అక్కన్నపేట, లక్ష్మాపూర్, శమ్నాపూర్, మెదక్  అనే  స్టేషన్లు ఉన్నాయి. ఈ లైన్ తో మెదక్ నుంచి అక్కన్నపేట, మిర్జాపల్లి మీదుగా సికింద్రాబాద్ రైల్వే లైన్ కు అనుసంధానం చేశారు. 

మహబూబ్ నగర్, కాచిగూడ నుంచి.. 

071577 నంబర్ లో ఈ ప్యాసింజర్ రైలు కాచిగూడ నుంచి ఉదయం 7.45 గంటలకు బయలుదేరి..  కొత్త రైల్వే లైన్ మీదుగా 11.10 గంటలకు మెదక్ చేరుకుంటుంది. మళ్లీ సాయంత్రం 5.10 గంటలకు మెదక్ నుంచి బయలుదేరి కాచిగూడకు 7.20 గంటలకు చేరుకుంటుంది. అలాగే మహబూబ్ నగర్ నుంచి ప్రతిరోజు సాయంత్రం 4.20 గంటలకు మరో ప్యాసింజర్ రైలు బయలుదేరి 7.20 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. అక్కడి నుంచి అది మళ్లీ బయలుదేరి.. రాత్రి 10.30 గంటలకు మెదక్ కు చేరుతుంది.