కంచ గచ్చిబౌలి భూములపై ఏఐ ఫొటోలు, వీడియోలు డిలీట్

కంచ గచ్చిబౌలి భూములపై ఏఐ ఫొటోలు, వీడియోలు డిలీట్

హైదరాబాద్: కంచ గచ్చి భూముల వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ప్రతిపాదిత భూమిలో జింకలు, నెమళ్లు ఉన్నట్టు ఓ ఫోటో సోషల్ మీడియాలో బాగా సర్క్యూలేట్ అయ్యింది. ఈ ఫొటోను సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర  మాజీ మంత్రి జీ జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని, మూగ జీవాలను కాపాడాలని పోస్టులు పెట్టారు.

అంతటితో ఆగకుండా ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఫొటోలు షేర్ అయ్యాయి. ఈ వీడియోలు, ఫొటోలను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ట్యాగ్ చేశారు. హెచ్సీయూ భూములు కాపాడాలని సినిమా తారలు కూడా పోస్టులు పెట్టారు. అందరూ దాదాపుగా అదే ఫొటోనూ వాడారు. కొన్ని పత్రికలు కూడా ఆ ఫొటోను పతాక శీర్షికన ప్రచురించాయి. సీన్ కట్ చేస్తే అది ఫేక్ ఫొటో..! దానిని ఏఐ క్రియేట్ చేసింది.

బుల్డోజర్లు, పక్కనే ఎగురుతున్న నెమ్మళ్లు.. సమీపంలో ఉన్న జింకలు అంతా ఏఐ క్రియేషనే. దీనిని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫొటోలను షేర్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన మన్నె క్రిశాంక్, దిలీప్ కొణతంకు నోటీసులు జారీ చేసింది. ఎవరెవరు ఈ ఫొటోలను షేర్ చేశారు.. ఎవరు క్రియేట్ చేశారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ఫేక్ వీడియోల వ్యాప్తికి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి  జగదీశ్ రెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసిన ఈ ఫొటోలను డిలీట్ చేయడం విశేషం.

అలర్ట్.. డిలీట్
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో నాయకులు, సోషల్ మీడియా వారియర్లు అలర్ట్ అయ్యారు.  సాక్షాత్తూ కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తాను ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేసిన ఏఐ క్రియేటెడ్ ఫొటోను డిలీట్ చేశారు. అలాగే రాష్ట్ర మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి కూడా ఆ ఫొటోలను డిలీట్ చేశారు. బీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్ లోనూ ఈ ఫొటోలు మాయమవడం గమనార్హం. ఓ జింక కళేబరం పడి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

Also Read:-ఇండియన్ విద్యార్థులకు ట్రంప్ షాక్స్.. స్పీడ్ డ్రైవింగ్ చేసినందుకు వీసా క్యాన్సిల్..!

ఆ ఫొటో కూడా నకిలీదని సైబర్‌ క్రైం అధికారుల విచారణలో తేలింది. అందులో జింక కాళ్లు కట్టేసి ఉన్నాయని, అది ఎక్కడో వేటాడిన జింక అని పేర్కొన్నారు. దానికి, కంచ గచ్చిబౌలి భూములకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పొటోనూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ పోస్టు చేశారు. అదే ఫొటోను పొరపాటున పోస్ట్‌ చేశానని, క్షమించాలంటూ జర్నలిస్ట్‌ సుమిత్‌ ఝా ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌ను కూడా సైబర్ క్రైం అధికారులు విడుదల చేశారు.

హెచ్సీయూ భూమిలోకి ఏనుగులు!!
సోషల్ మీడియా హ్యాండిల్స్ లో హెచ్సీ యూ భూముల్లో ఏకంగా ఏనుగులే ఉన్నట్టు కొన్ని వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. ఉమంగ్ జైన్ పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ లో ఏకంగా తీవ్రంగా గాయపడ్డ ఏనుగు ఫొటోనే పోస్టు చేయడం విశేషం. అడ్వొకేట్ జానీ వర్మ పేరుతో ఉన్న హ్యాండిల్ లో ఏకంగా ఓ ఏనుగుల గుంపే వెళ్తున్న వీడియో పోస్ట్ అయ్యింది. 

ఫేక్ కాదు.. నిజమైనవే: దియా మీర్జా
ఇదే కేసులో సినీనటి దియామీర్జా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఏఐ జనరేటెడ్ ఫొటోలను షేర్ చేసినట్టు సీఎంవో చెబుతోంది. వారినైనా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరింది.  బాలీవుడ్ నటీమణి దియా మీర్జా  నటీమణి ఈ వివాదంపై స్పందించారు.   తాను ఎలాంటి నకిలీ వీడియోలు, ఫొటోలు షేర్‌ చేయలేదని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.  

ట్రెండింగ్  హ్యాష్ ట్యాగ్స్
సోషల్ మీడియాలో #SaveHCU, #SaveHCUBioDiversity, #HCU, #SaveKanchaGachibowli హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అయ్యాయి. ఈ హ్యాష్ ట్యాగ్స్ తో ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసినట్టు సైబర్ క్రైం అధికారులు గుర్తించారు.