డీలిమిటేషన్​పై కేబినెట్​లో చర్చ జరగలేదు : మంత్రి కిషన్ రెడ్డి

డీలిమిటేషన్​పై కేబినెట్​లో చర్చ జరగలేదు : మంత్రి కిషన్ రెడ్డి
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంటులోగానీ,  కేబినెట్‌‌లోగానీ ఎటువంటి చర్చ జరగలేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. డీలిమిటేషన్‌‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్  అసలు రంగు బయట పడిందని ఆయన పేర్కొన్నారు.  డీలిమిటేషన్ పై చెన్నైలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్  పార్టీలు పోటీపడి మాట్లాడటం వారి నిజస్వరూపాన్ని బయట పెట్టిందన్నారు. దేశంలో లేని సమస్యను సృష్టించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. 

ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్  రెడ్డి మాట్లాడారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నదని అవకాశవాద పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్  అయ్యారు. ‘‘తమిళనాడులో స్టాలిన్  ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలకు పాల్పడింది. ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నదని, దీని నుంచి తప్పించుకోవడానికి డీఎంకే నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొన్ని కుటుంబ పార్టీలు, కుంభకోణాల పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీ మధ్య సయోధ్య కుదిర్చేందుకు మజ్లిస్  పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఒక్కటైనా తెలంగాణ ప్రజల మద్దతుతో ఆ మూడు పార్టీలను ఎదుర్కొంటామన్నారు. తమిళనాడులో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్  పార్టీ స్టాలిన్ ను ముందుపెట్టి నాటకమాడుతోందని విమర్శించారు.