హైదరాబాద్ : జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందే దిశా మీటింగ్‌కు తేదీ నిర్ణయించినా జీహెచ్ఎంసీ అధికారులు హాజరుకాకపోవడంపై సీరియస్ అయ్యారు. దిశా సమావేశం ఉన్నా స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలా పెట్టుకుంటారని అధికారులను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణానికి తాము ఒప్పుకున్నా జీహెచ్ఎంసీ మాత్రం సహకరించడం లేదని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు రైల్వేశాఖ అధికారులు.
రెండు రోజుల ముందు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమం పెట్టుకుని.. దిశా సమావేశానికి డుమ్మా కొడుతారా..? అంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సమావేశానికి హాజరుకాని అధికారుల తీరును తప్పుపట్టారు. జీహెచ్ఎంసీ సహకారం లేని కారణంగా పనులన్నీ పెండింగ్‌లో పడుతున్నాయన్నారు. దిశా సమావేశంలో సమాధానాలు చెప్పేవారు కూడా లేరన్నారు. ఆర్వోబీ నిర్మాణ పనులు చేసేందుకు రైల్వేశాఖ సిద్ధంగా ఉన్నా.. తగిన సహకారం లేకపోవడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. జీహెచ్ఎంసీ, రైల్వేశాఖ సిబ్బందిని కోఆర్డినేట్ చేసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.
దిశా సమావేశానికి హాజరుకాని అధికారులపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు కిషన్ రెడ్డి. మూడు నెలలకు ఒకసారి జరిగే ఈ సమావేశానికి మంచి ప్రాధాన్యత ఉందన్నారు. ఉన్నతాధికారులు సమావేశానికి రాకుండా.. వారి కిందిస్థాయి సిబ్బందిని పంపడం మంచి సంప్రదాయం కాదన్నారు. పాఠశాలలలో విద్యుత్ నిలిపివేత చాలా సీరియస్ అంశమన్నారు. ఈ అంశంపై అధికారులతో చర్చించి.. మరోసారి అలా జరగకుండా చూసుకోవాలన్నారు.