80 వేల పుస్తకాలు చదివిన నీకు చరిత్ర తెలుస్తలేదా? : కిషన్​రెడ్డి

80 వేల పుస్తకాలు చదివిన నీకు చరిత్ర తెలుస్తలేదా?  : కిషన్​రెడ్డి
  • విమోచనమా.. సమైక్యతనా.. చర్చిద్దాం రా
  • 80 వేల పుస్తకాలు చదివిన నీకు చరిత్ర తెలుస్తలేదా?
  • సెప్టెంబర్​ 17న పరకాల అమరధామం వద్దకు రావాలి
  • సీఎం కేసీఆర్​కు బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డి సవాల్
  • చరిత్రను కాంగ్రెస్​ తొక్కిపెట్టింది.. 
  • సోనియాగాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదని ఫైర్​
  • సికింద్రాబాద్​ నుంచి పరకాల అమరధామం వరకు బైక్​ ర్యాలీ


పరకాల, వెలుగు: ‘‘విమోచనమా.. సమైక్యతా దినమా.. చర్చిద్దాం. దమ్ముంటే పరకాల అమరధామానికి సెప్టెంబర్​ 17న రా..’’ అని సీఎం కేసీఆర్​కు బీజేపీ స్టేట్​ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సవాల్​ విసిరారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 13 నెలలు రజాకార్ల నిర్బంధంలోనే తెలంగాణ ఉందని గుర్తుచేశారు. ‘‘80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్​కు పోరాటాలు, చరిత్ర తెలియడం లేదా? ఇక్కడ జరిగిన ఆకృత్యాలు చెప్తయ్..​ ఇది పోరాటమో, సమైక్యతనో” అని ఆయన అన్నారు. సెప్టెంబర్​ 17 తెలంగాణ విమోచన దినోత్సవ చరిత్రను కాంగ్రెస్​ తొక్కిపెట్టిందని, అలాంటి పార్టీకి నాయ కురాలైన సోనియాకు, ఆమె కుటుంబానికి తెలంగాణలో విమోచన దినోత్సవాన అడుగుపెట్టే హక్కులేదని అన్నారు. హైదరాబాద్​కు రావాలంటే చార్మినార్​లోని మహంకాళి అమ్మవారి ఆలయం ముందు సోనియాతో పాటు ఆమె కుటుంబసభ్యులు రక్తమొచ్చేట్టు ముక్కునేలకు రాసి తప్పయిందని ఒప్పుకోవాలని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ‘‘75 ఏండ్ల కింద నిజాం రజాకార్లను భారత సైన్యం ఓడించి.. అప్పటి హోంమంత్రి వల్లభాయ్​ పటేల్​తో సికింద్రాబాద్​ పరేడ్ ​గ్రౌండ్​లో మూడు రంగుల జెండాను ఎగురేసింది. 75 ఏండ్ల తర్వాత ఇప్పు డు మోదీ హయాంలో అదే హోంమంత్రి స్థానంలో ఉన్న అమిత్​షా అదే పరేడ్​ గ్రౌండ్​లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నరు” అని తెలిపారు. 

ALSO READ: 1.31 లక్షల మందికి తాత్కాలిక జాబ్స్ : ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ 

ఏటా సెప్టెంబర్​ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం కిషన్​రెడ్డి సికింద్రాబాద్​ నుంచి హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామానికి సుమారు 200 కిలోమీటర్లు బైక్​ ర్యాలీ నిర్వహించారు. అమరధామంలో అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘రజాకార్ల నాయకుడు పాకిస్తాన్​ వెళ్తూ మజ్లిస్​ పార్టీని ఒవైసీ ఫ్యామిలీకి అప్పజెప్పిండు. ఆ మజ్లిస్​కు భయ పడే చరిత్రను  కాంగ్రెస్​ దాచిపెట్టింది.  1998లో బీజేపీ బయటపెట్టే వరకూ 1948 సెప్టెంబర్​ 17న  హైదరాబాద్​ సంస్థానానికి స్వాతంత్ర్యం వచ్చిందనే విషయం బయటకు తెలియదు” అని అన్నారు. 

ఓట్ల కోసం చరిత్రను మరుగునపడేస్తరా?

రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు సెప్టెంబర్​ 17 విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్​ చేసిన కేసీఆర్​లో ఇప్పుడు మజ్లిస్​ ఆత్మ చొచ్చిందని కిషన్​ రెడ్డి విమర్శించారు. రక్తపు చరిత్రను, పోరాటాలను, బలిదానాలను ప్రజలకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ‘‘తుపాకీ తూటాలకు గుండెలడ్డుపెట్టిన చరిత్ర తెలంగాణది.  ఓట్లు, అధికారం కోసం చరిత్రను మరుగునపడేస్తరా? భావితరాలకు చరిత్ర తెలియకుండా చేసిన కాంగ్రెస్​కు తెలంగాణలో మీటింగ్​ పెట్టే అధికారం లేదు. కేసీఆర్​ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేండ్లయినా ఎందుకు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు?” అని ఆయన నిలదీశారు. అమరవీరులకు నివాళులు అర్పించే పండుగను రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వైభవంగా జరుపుతామని చెప్పారు. తెలంగాణకు ఎవరొచ్చినా అమరధామాన్ని దర్శించేలా దర్శనీయ క్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ కుటుంబ పార్టీలు

కాంగ్రెస్​కు ఓటేస్తే సోనియా కుటుంబానికి ఓటేసినట్టని, బీఆర్ఎస్​కు ఓటేస్తే కేసీఆర్​ కుటుంబానికి ఓటేసినట్టని, అదే బీజేపీకి ఓటేస్తే అభివృద్ధికి ఓటేసినట్టని కిషన్​రెడ్డి చెప్పారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​  రెండూ కుటుంబ పార్టీలేనని, తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టిన, నిర్లక్ష్యం చేసిన పార్టీలని, వాటికి తగిన బుద్ధిచెప్పాలని అన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నేతలు గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి, గరికపాటి మోహన్​రావు, చాడ సురేష్​రెడ్డి, కొండేటి శ్రీధర్, గుండేటి విజయరామారావు, డాక్టర్​ పెసరు విజయచందర్​రెడ్డి, మొలుగూరి భిక్షపతి, మార్తినేని ధర్మారావు, ఒంటేరు జయపాల్​, డాక్టర్​ సంతోష్​కుమార్​, చందుపట్ల కీర్తిరెడ్డి, పగడాల కాళీప్రసాద్, మురళీధర్​గౌడ్​, జయంతిలాల్​ పాల్గొన్నారు.

200 కిలోమీటర్లు బైక్​ ర్యాలీ

కిషన్​రెడ్డి బైక్​ ర్యాలీని శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్​ ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో బైకులపై వెంటరాగా కిషన్ రెడ్డి బుల్లెట్​ను నడుపుతూ  ముందుకు కదిలారు. పరకాల అమరధామం వరకు దాదాపు 200 కిలోమీటర్లు బైక్​ ర్యాలీ సాగింది. కాజీపేట మడికొండ వద్ద వందలాది బైకులతో ర్యాలీలో పాల్గొన్నారు. 

కేయూ స్టూడెంట్లకు అండగా ఉంటం

వరంగల్/హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ పీహెచ్​డీ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలను కేంద్ర విద్యా శాఖ మంత్రి, యూజీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని కిషన్ రెడ్డి అన్నారు. పోలీసుల దాడిలో గాయపడ్డ కేయూ స్టూడెంట్లను ఆయన వర్సిటీ నిరసన దీక్ష వద్ద పరామర్శించారు. దాడి చేయించిన కేయూ వీసీ రమేశ్, రిజిస్ట్రార్ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకునే వరకు స్టూడెంట్ల వెంట ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత స్టూడెంట్లను కేంద్ర విద్య శాఖ మంత్రితో కల్పిస్తానని చెప్పారు. కాకతీయ యూనివర్సిటీకి నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.