
హైదరాబాద్: మన ప్రధాన శత్రువు మజ్లీస్ పార్టీ.. బీజేపీని ఓడించేందుకు ఆ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మజ్లిస్ చాపకింద నీరులా బలాన్ని పెంచుకుంటుందని.. జాగ్రత్త పడకపోతే రాష్ట్రంలో మజ్లిస్ పుంజుకుంటుందన్నారు. బీఆర్ఎస్తో పదేళ్లు అంటకాగిన ఎంఐఎం.. ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసిందని.. అధికారం ఎక్కడుంటే ఆ పార్టీ వారి వంచన చేరుతుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మగా మారారని.. మజ్లీస్ పార్టీ అనుమతి లేకుండా ఓల్డ్ సిటీలోకి ప్రవేశించే పరిస్థితి లేదని ఫైర్ అయ్యారు. మజ్లీస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడి.. దాని కోరలు పీకాలని పిలుపునిచ్చారు.
దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం అభివృద్ధి వేగంగా జరుగుతుంది. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలు దివాళా తీసే పరిస్థితి నెలకొందన్నారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలన, 14 నెలల కాంగ్రెస్ పాలన ప్రజలు చూసి విసిగిపోయారు. సీఎం రేవంత్ మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు సచివాలయం కూడా దాటట్లేదని ఎద్దేవా చేశారు. మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా భరత్ గౌడ్ శనివారం (ఫిబ్రవరి 15) బాధ్యతలు చేపట్టాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కిషన్ రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీలో కుటుంబం మాత్రమే నేతృత్వం వహిస్తుంది.
బీజేపీలో సాధారణ కార్యకర్తలకు కూడా బాధ్యతలు, పదవులు కూడా లభిస్తాయని చెప్పారు. సామాన్య కార్యకర్తలకు కూడా కీలక పదవులు ఇవ్వడం కేవలం బీజేపీకే సాధ్యమన్నారు. భరత్ గౌడ్ కుటుంబం ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న కుటుంబం.. భరత్ తండ్రి మైసయ్య నేను ఎన్నో యేండ్లు కలిసి పని చేశామని గుర్తు చేశారు. మొదట ఆయన పై కాల్పులు జరిపినప్పుడు సెక్యూరిటీ పెంచామని.. ఆ తర్వాత దురదృష్టవశాత్తు నక్సలైట్ల చేతిలో మైసయ్య మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మనం ఇప్పటి వరకు అధికారంలోకి రాలేదు..ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ మెజార్టీ స్థానాల్లో గెలిచే విధంగా పని చేయాలని సూచించారు.