ఓటర్లను రూ.కోట్లు పెట్టికొంటున్నరు : కిషన్ రెడ్డి

  • ఓటర్లను,ప్రజాప్రతినిధులను రూ.కోట్లు పెట్టికొంటున్నరు
  • కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: పార్లమెంట్ సభ్యుడు, ఒక‌ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాకు బతికుండగానే సమాధి కట్టడం టీఆర్ఎస్ నీచ సంస్కృతి కి నిదర్శనమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. నడ్డాకు సమాధి కట్టిన టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ప్రజలే సమాధి కడతారన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వందల, వేల కోట్లు ఖర్చు పెట్టినా హుజూరాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవలేదని‌ గుర్తు చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలకు కోట్ల రూపాయలు పెట్టి ప్రజాప్రతినిధులను, ఓటర్లను గొర్రెల్లా కొని గెలుస్తానని టీఆర్ఎస్ అనుకుంటుందని, కానీ నల్లగొండ ప్రజలు చైతన్యవంతులని, అమ్ముడుపోరన్నారు. ఒక ముఖ్యమంత్రి ఒక గ్రామ స్థాయిలో బూత్ కి ఇన్​చార్జి గా ఉన్నాడంటేనె టీఆర్ఎస్ ఎంత దిగజారిపోయిందో తెలుస్తుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభింపచేసి మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం మునుగోడులోనే ఉన్నారని‌ విమర్శించారు.

త్యాగాలు, ఆత్మ బలిదానాలు‌ చేసి తెచ్చుకున్న తెలంగాణ ఓ కుటుంబం చేతిలో ఆటబొమ్మలా మారిపోయిందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ సమాజం ఈ కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేయాలని భావిస్తున్నారన్నారు. నల్లగొండ జిల్లాలో 2017–18లో ఫ్లోరైడ్ నిర్మూలన కోసం కేంద్రం రూ.800 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం ట్రాక్టర్లు ఇస్తే టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో అసైన్డ్, బంజరు భూములు కనిపిస్తే టీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని బొందపెట్టాలనుకుంటే.. కేంద్ర ఎన్నికల సంఘం కాపాడిందని ప్రశంసించారు. ఈ ఎన్నికపై తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. తర్వాత చల్మడ, ఇప్పర్తిలో బీజేపీ లీడర్లు మిథున్ రెడ్డి, గోగుల రాణాప్రతాప్ రెడ్డి, చాడా సురేశ్​రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.