- కేసీఆర్ పతనం షురువైందని కామెంట్
- ప్రజాధనం దోసుడు, అపొజిషన్‌ను
- అణుచుడే సీఎం ఎజెండా
భైంసా, వెలుగు: రాష్ట్రంలో పోలీసులు టీఆర్ఎస్కు చెంచాగిరి చేస్తున్నారని, ప్రవర్తన మార్చుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు తప్పులు చేస్తున్నారని, రాజకీయ పార్టీలను అణిచివేసే దోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ శాశ్వతం కాదని, ఆయన పతనం మొదలైందని అన్నారు. వెయ్యి మంది కేసీఆర్‌లు, ఒవైసీలు ఒక్కటైనా ప్రధాని మోడీని అడ్డుకోలేరని చెప్పారు. కేంద్రంలో మరోసారి మోడీ సర్కారు అధికారంలోకి రాబోతోందన్నారు. దుష్ట పాలనను తరిమికొట్టేందుకు జైలుకు వెళ్లడానికయినా సిద్ధమేనని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
కేసీఆర్‌కు ఎవరిపైనా గౌరవం లేదు
రాష్ట్రంలో ప్రతీ 50 మందికి ఒక బెల్టు షాపు నడుస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు ప్రధానిపై, గవర్నర్‌పై గౌరవం లేదని, ఉద్యమాలను కూడా ఆయన గౌరవించరని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణిచివేసుడు, ప్రజాధనాన్ని దోచుకునుడే ఆయన ఎజెండాగా పెట్టుకున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ఎన్నికల్లో గెలిచేందుకే దళిత బంధు తెచ్చారని, ఆ స్కీమ్ లబ్ధిదారులంతా ఈటల రాజేందర్ ఫొటో పెట్టుకోవాలని సూచించారు. బీసీ బంధు, గిరిజన బంధు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు.
సైనిక్ స్కూల్, సైన్స్‌సిటీ, ఎంఎంటీఎస్ లాంటి పథకాలను పక్కన పెట్టిన కేసీఆర్ తన కుటుంబ సంక్షేమం కోసం ధరణిని ప్రవేశ పెట్టి భూముల కబ్జాలకు తెగబడుతున్నారని ఆరోపించారు. తన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల రక్తం తాగుతోందని, డబ్బులతో రాజకీయాలు చేస్తామని భ్రమపడుతున్నారని అన్నారు. కేసీఆర్‌పై వ్యక్తిగత పోరాటం కాదని, అవినీతి, అక్రమ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగుతుందన్నారు.
సర్కారు బడులను పట్టించుకుంటలే: ఈటల
రాష్ట్రంలో ఏ ఇంటి తలుపు తట్టినా కేసీఆర్ ఓటమి ఖాయమంటున్నారని, ఆయన ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రగతి భవన్, ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సర్కారు బడుల్లోని పిల్లలకు సరైన భోజనం అందించట్లేదని, పిల్లలు రోగాల పాలవుతున్నా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. బాసర ట్రిపుల్‌ఐటీలో చదువు, తిండి కోసం పిల్లలు ఉద్యమాలు చేయాల్సివచ్చిందన్నారు. మీ మనవడికి మాదిరిగా విద్యాసంస్థల్లో పిల్లలకు ఎందుకు తిండి పెట్టట్లేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని కేసీఆర్ విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీలు రాథోడ్ రమేశ్, బూర నర్సయ్య గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్‌రావు పటేల్, తదితరులు పాల్గొన్నారు.
ఐదు గంటలకే సభ ముగింపు
హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సంజయ్ తన ప్రసంగాన్ని సాయంత్రం 4.59 గంటలకే ముగించారు. సాయంత్రం 4.45 గంటలకు స్పీచ్ ప్రారంభించిన ఆయన.. 14 నిమిషాల పాటు ఉద్వేగభరితంగా మాట్లాడారు. కోర్టులంటే తమకు గౌరవం ఉందని, అందుకే కోర్టు ఆదేశాల ప్రకారం ఐదు గంటలలోపే సభను ముగిస్తున్నట్లు తెలిపారు. నిర్దేశించిన సమయానికి ఒక నిమిషం ముందు స్పీచ్ ను ముగించారు.
కొడుకుకు మోడీ పేరు పెట్టిన అభిమాని
ప్రధాని మోడీ అభిమాని ఎడ్ల మహేశ్దంపతులు తమ కొడుకుకు విశ్వేశ్ నరేంద్రమోడీగా నామకరణం చేశారు. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ భైంసా సమీపంలోని కమలాపూర్ గుట్ట వద్ద బస చేశారు. మంగళవారం మహేశ్ అక్కడికి వచ్చి తమ 3 నెలల కొడుకుకు మోడీ పేరువచ్చేలా నామకరణం చేయాలని సంజయ్‌ను కోరారు. దీంతో విశ్వేశ్ నరేంద్ర మోడీ అని సంజయ్ సూచించారు. మోడీ అంటే తమకు ఎంతో ఇష్టమని, ఇంకో 20 ఏండ్లు ఆయనే దేశాన్ని పాలించాలని, రాష్ట్రంలో నూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మహేశ్ దంపతులు ఆకాంక్షించారు.